సుదీర్ఘవిరామం తరువాత అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి జయలలిత పోలీస్‌శాఖపై మంగళవారం
సుదీర్ఘవిరామం తరువాత అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి జయలలిత పోలీస్‌శాఖపై మంగళవారం కానుకల వర్షం కురిపించారు. వరుస ప్రారంభోత్సవాలతో బిజీ బిజీగా గడిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
చె న్నై, సాక్షి ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినపుడు సహాయక చర్యలు వంటి అనేక బాధ్యతలను పోలీసు శాఖ నిర్వర్తిస్తోంది. అయితే పోలీసులు బాధ్యతలకు తగినట్లుగా శాఖాపరంగా వసతి సౌకర్యాలను కల్పించి సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు, పోలీసు సిబ్బందికి నివాస గృహాలు, గస్తీ విధులకు అనుగుణంగా వాహన సౌకర్యం కల్పించాలని జయలలిత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అందులో పేర్కొన్నారు. 27 జిల్లాల్లో రూ.321 కోట్లతో నిర్మించిన 3918 నివాసగృహాలను ఆమె ప్రారంభించారు.
ఇందులో భాగంగా మదురై నగరంలోని సాయుధ బలగాలకు రూ.20.65 కోట్లతో 226 పోలీస్ వసతి గృహాలను సీఎం జయలలిత మంగళవారం ప్రారంభించినట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. మదురవాయల్, మడిపాక్కం, మదురై తదితర ప్రాంతాల్లో రూ.31 కోట్లతో 68 సముద్రతీర, సాధారణ పోలీస్‌స్టేషన్లను ఆమె ప్రారంభించారు. అలాగే కాంచీపురం జిల్లా తిరుక్కుళుకున్రం, తిరువన్నామలై జిల్లా సెంగం, కీళ్‌పెన్నాత్తూరు, కడలూరు జిల్లా పన్రుట్టి, నెల్లికుప్పం, తిరుపూరు జిల్లా పల్లడం తదితర అనేక పట్టణాల్లో రూ.11.38కోట్లతో 130 అగ్నిమాపక, సహాయ కేంద్రాలను అమె ప్రారంభించారు.
కేవలం పోలీస్‌శాఖకే మొత్తం రూ.444 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. చెన్నై మాంబళం అనేక వ్యాపార కూడలిగా ఉండటం, అనేక ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైళ్లుకు మాంబళం స్టేషన్‌లో స్టాపింగ్ కలిగి ఉన్న కారణంగా ప్రజల రద్దీని పురస్కరించుకుని కొత్తగా రెండు పోలీస్‌స్టేషన్లను ఆమె ప్రారంభించారు. అలాగే చెన్నై నగర పోలీస్ కమిషనర్ పరిధిలో సేవలకోసం 52 పోలీస్ జీపులను జయ అందజేశారు. ఈ పోలీస్ జీపులను సముద్రతీరాల్లో గస్తీ కోసం ఉపయోగించేలా తీర్చిదిద్దారు.