ఢిల్లీ పాఠశాలకు ‘జీ’ సతీమణి
న్యూఢిల్లీ: నగరంలోని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సతీమణి పెంగ్ లియాన్ నగరంలోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించనున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆమె గురువారం ఢిల్లీలో పర్యటించి, మదర్స్ ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ మధులికా సేన్ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చైనా ప్రథమపౌరురాలు 45 నిమిషాల పాటు పిల్లలతో గడుపుతారని తెలిపారు. ఆ సమయంలో విద్యార్థులతో పాటలు, నృత్యాల వంటి కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
కొంతమంది ఎంపిక చేసిన విద్యార్థులతో పెంగ్ భేటీ అవుతారని, వారికి కాలీగ్రఫీపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. తమ పాఠశాలకు చైనీస్ పాఠశాలతో ప్రత్యేక అనుబంధం ఉందని సేన్ వివరించారు. చైనీస్ పాఠశాలలో తాము యోగా, కథక్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటామని, అలాగే తమ పాఠశాలలో వారు తాయ్ ఛీ, కాలీగ్రఫీపై తరగతులు చేపడుతుంటారని వివరించారు. దేశభక్తి జానపద గీతాలు ఆలపించడంలో పెంగ్ లియాన్‌కు మంచి పేరుంది. కాగా, మదర్స్ ఇంటర్నేషనల్ పాఠశాల శ్రీ అరబిందో మార్గ్‌లో ఉన్న శ్రీ అరబిందో ఆశ్రమం (ఢిల్లీ శాఖ) ప్రాంగణంలో ఉంది.