న్యూఢిల్లీ: రాత్రి వేళల్లో ఢిల్లీ మెట్రోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు క్షేమంగా ఇంటికి చేరుకునేలా మెరుగైన భద్రత కల్పించాలని కేంద్ర పరిశ్రమల భద్రత దళం(సీఐఎస్‌ఎఫ్) నిర్ణయించింది. కేవలం మెట్రోల్లో భద్రత కల్పించడమే కాకుండా, వారు క్షేమంగా ఇంటికి చేరుకునేలా ఆటో, రిక్షా, బస్సు వంటి ప్రయాణ సాధనాలు కూడా సమకూర్చాలని తమ మహిళా సిబ్బందికి సీఐఎస్‌ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డీఎంఆర్‌సీ పరిధిలో 136 మెట్రో సేష్టన్లు ఉండగా, పురుషులు, మహిళలు కలిపి 4,800 మంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళా ప్రయాణికులకి సాయమందించాలని మేము మా సిబ్బందికి చెప్పాం. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఆటోలు, రిక్షా వంటి ప్రయాణ సాధనాలు కూడా సమకూర్చి, వాటి నంబర్లను నోట్ చేసుకోవాలని చెప్పాం.
తద్వారా తమను గమనిస్తున్నారనే భయంతో మహిళా ప్రయాణికులతో డ్రైవర్లు సక్రమంగా నడుచుకుంటారు. దీంతో మహిళలు క్షేమంగా ఇంటికి వెళ్లగలుగుతారు’ అని సీఐఎస్‌ఎఫ్ డీజీ అర్వింద్ రంజన్ చెప్పారు. సోమవారం సీఐఎస్‌ఎఫ్ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మెట్రో స్టేషన్లలో ఉన్న సీసీటీవీలు కూడా తమకు తోడ్పాటునందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 180 సంఘటనల్లో ఇవి ఉపయోగిపడ్డాయని తెలిపారు. వీటిని ఉపయోగించి ట్రాక్‌లపై నడుస్తున్న 500 మంది పై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
మంచి ప్రవర్తన, నైపుణ్యాలను నేర్పించి తమ సిబ్బందిని మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం నియమించామని తెలిపారు. అలాగే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, చాందినీ చౌక్, కష్మీరీ గేట్, చౌరీ బజార్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి ఆరు ప్రాంతాల్లో గ్లాస్ డోర్ కారిడార్ల ఎత్తు పెంచాలని డీఎంఆర్‌సీకి ప్రతిపాదించింది. స్టేషన్లలో 90 శాతం దొంగతనాలు మహిళా దొంగలు చేస్తున్నారని తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హెల్ప్‌లైన్ నంబరు స్థానంలో సులభంగా గుర్తుండేలా నాలుగు సంఖ్యల నంబరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఐఎస్‌ఎఫ్ అధికారులు డీఎంఆర్‌సీకి సూచించారు. తద్వారా ప్రజలు సీఐఎస్‌ఎఫ్‌ని సంప్రదించడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు.
మహిళా సంరక్షణకు మెరుగైన భద్రత
Published Mon, Mar 9 2015 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement