- 93.12 శాతం పోలింగ్ నమోదు
- సోమవారం ఓట్ల లెక్కింపు
కోలారు/మాలూరు/ముళబాగిలు, న్యూస్‌లైన్ : రాష్ట్ర ఒక్కలిగ సంఘానికి సంబంధించి కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల నుంచి మూడు డెరైక్టర్ల స్థానాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
మొత్తం 93.12 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం గోకుల విద్యా సంస్థలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోలారు, చిక్కబళ్లాపురంలో మొత్తం 35500 ఓటర్లు ఉండగా 32162 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోలారులోని మహిళా సమాజ కళాశాల, సదాశివ స్మారక భవనంతోపాటు మొత్తం 19 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోలారు తాలూకాలో 9354 మంది ఓటర్లు ఉండగా 8157 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కలిగ సంఘానికి జరిగిన ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. మహిళా సమాజ తదితర పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల మద్దతు దారులు మకాం వేసి ఓటర్లను ఓటు అడగడం కనిపించింది.
బరిలో 14 మంది అభ్యర్థులు : ఒక్కలిగ సంఘం డెరైక్టర్ల స్థానాలకు నిర్వహించిన ఎన్నికలో కోలారు చిక్కబళ్లాపురం నుంచి 14 మంది బరిలో ఉన్నారు.
వీఈ రామచంద్ర, కేబి గోపాలకృష్ణ, హెచ్‌సీ నవీన్‌కుమార్, పి. నాగరాజ్, ఆర్.నంజుండగౌడ, డీకే రమేష్, యలువళ్లి రమేష్, డి.రామచంద్ర, టి.ఎం.రఘునాథ్, హెచ్. లోకేష్, సి.వి. లోకేష్ గౌడ, ఎన్.శ్రీరామరెడ్డి, ఎం.ఎల్. సతీష్, ఎం.ఎన్. సదాశివరెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 14 మందిలో ఎక్కువ ఓట్లు పొందిన ముగ్గురు అభ్యర్థులను ఉభయ జిల్లాల నుంచి డెరైక్టర్లుగా ఎంపిక చేస్తారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఒక్కలిగ సంఘం డెరైక్టర్ల స్థానాలకు ఆదివారం మాలూరు, ముళబాగిలులో ఎన్నికలు నిర్వహించారు. మాలూరులో బీజీఎస్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 85 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్యే మంజునాథ్‌గౌడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అదేవిధంగా ముళబాగిలులోని నేతాజీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 1227 మంది ఓటర్లకుగాను 1018 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.