షామియానాలు, టెంట్లు, అంబులెన్సులను అందుబాటులో ఉంచిన బీఎంసీ
సాక్షి, ముంబై: భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చైత్యభూమివద్ద సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి అంబేద్కర్‌కు నివాళులర్పిం చేందుకు వచ్చే లక్షలాది మంది అభిమానులకు బీఎంసీ పరిపాలనా విభాగం మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇందులోభాగంగా శివాజీపార్క్ మైదానంలో లక్షా చదరపు టడుగుల విస్తీర్ణంలో భారీ టెంట్లు, షామియానాలు తదితరాలను సిద్ధం చేసింది. ఈ నెల ఆరో తేదీన అంబేద్కర్ వర్ధంతి కావడంతో మూడు రోజుల ముందు నుంచేఆయన అనుయాయులు నగరానికి చేరుకోవడం మొదలైంది. వారు బస చే యడం మొదలుకుని స్నానాల గదులు, తాగునీరు, సంచార మరుగుదొడ్లు, అక్కడక్కడా తాత్కాలిక కుళాయిలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు.
బెస్ట్ సంస్థ కూడా తనవంతుగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొబైల్ ఫోన్ల చార్జింగ్ వసతితోపాటు, భారీ విద్యుత్ దీపాలు, ఫ్లడ్ లైట్లు తదితర సౌకర్యాలు కల్పించింది. అదేవిధంగా పోలీసు శాఖ కంట్రోల్ రూంలు, భారీ పోలీసు బలగాలను సమకూర్చి సిద్ధంగా ఉంచింది. చలి కారణంగా ఎవరైనా అనారోగ్యం బారినపడితే వారికి అక్కడే వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచింది. శివాజీపార్కు మైదానంతోపాటు చైత్యభూమికి సమీపంలో ఉన్న ఇందు మిల్లు ఖాళీ స్థలాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. అక్కడ తాత్కాలిక మరుగుదొడ్లు, తాగు నీటితోపాటు విద్యుత్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ శాఖ ఏర్పాట్లు
మహాపరినిర్వాణ్ పురస్కరించుకుని శుక్ర, శని, ఆది వారాలు దాదర్, శివాజీపార్క్, చైత్యభూమి పరిసరా ప్రాంతాలన్నీ అంబేద్కర్ అభిమానులతో కిటకిటలాడుతుంటాయి. దీంతో ఇటు అంబేద్కర్ అనుయాయులతోపాటు అటు వాహన చోదకులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ శాఖ తగు చర్యలు తీసుకుంది. శివాజీపార్క్, దాదర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించనున్నారు. మరికొన్నింటిని వన్‌వేగా, నో పార్కింగ్ జోన్లు ప్రకటించనున్నారు. ఐదు, ఆరు, ఏడో తేదీల్లో వాహనాల్లో రాకపోకలు సాగించేవారు దాదర్, శివాజీపార్కు మీదుగా కాకుండా ఇతర మార్గాల మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ శాఖ సూచించింది. చైత్యభూమికి చుట్టుపక్కల నివసించేవారు తమ వాహనాలను దూరంగా ఎక్కడైనా నిలిపిఉంచి కాలిబాటన రావాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
చైత్యభూమి దర్శనానికి ఏర్పాట్లు
అంబేద్కర్ సమాధిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారు. అందువల్ల ఈ క్యూ నాలుైగైదు కిలోమీటర్ల మేర ఉంటుంది. ఎస్వీ రోడ్డుపై చైత్యభూమికి ఇటు మాహిం అటు సెంచురీ బజార్ ఇలా రెండు దిశల్లో క్యూలో నిలబడేందుకు ఏర్పాట్లు చేశారు తోపులాటలు జరగకుండా ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక బారికేడ్లను నిర్మించారు. దాదర్‌లో రైలు దిగిన వారికి మార్గదర్శనం చేసేందుకు అక్కడ కార్యకర్తలను నియమించారు. దారి పొడవునా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు అంబేద్కర్ అభిమానులకు రైల్వే పరిపాలనా విభాగం కూడా తనవంతుగా ఏర్పాట్లు చేసింది.
ప్రతి ఆదివారం నిర్వహించనున్న మెగాబ్లాక్‌ను ఈ ఆదివారం రద్దు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్, కొంకణ్ మార్గంలో పది ప్రత్యేక రైళ్లు నడపనుంది. రాకపోకలు సాగించేందుకు పశ్చిమ, సెంట్రల్, హార్బర్ మార్గంలో అర్థరాత్రి ప్రత్యేకంగా కొన్ని లోకల్ ట్రిప్పులు నడపనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో సాయంత్రం, రాత్రి తరువాత దాదర్, సీఎస్టీనుంచి రోజూ రెండు చొప్పున నాగపూర్, నాందేడ్, ఔరంగాబాద్, బుసావల్, చాలీస్‌గావ్ తదితర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ అనుయాయులకు రైల్వే అధికారులు సూచించారు.
అంబేద్కర్ వర్ధంతికి సర్వం సిద్ధం
Published Thu, Dec 4 2014 3:57 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement