
సర్కారుకు జరిమానా
సాక్షి, చెన్నై :సీఎం పన్నీరు సెల్వం సర్కారుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా మండి పడింది. సీసీ కెమెరాల ఏర్పాటు వ్యవహారంలో నిర్లక్ష్యం ఏమిటంటూ ఆ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. రూ.పదివేలు జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని కట్టాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో రాష్ట్రంలో సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని, ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పాల న అధ్వానంగా మారిందన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వం, కోర్టు వ్యవహారాల్లోను అదే బాటలో పయనిస్తున్నట్టుంది. రిట్ పిటిషన్ల దాఖలులో జాప్యంపై కోర్టులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. గత నెల రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఓ కేసు విషయంలో రూ.పది వేలు జరిమానా విధించింది. పలు కేసు విషయాల్లో అక్షింతలు పడుతున్నాయి. ఈ వ్యవహారాలు మరువక ముందే, మళ్లీ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో పాటుగా రూ.10 వేలు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.
పిటిషన్: నగరానికి చెందిన న్యాయవాది పి ప్రకాష్‌రాజ్, నారాయణన్ కలిసి ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పోలీసు స్టేషన్లలో సాగుతున్న వ్యవహారాలు, లాకప్ డెత్ ఘటనల్ని తమ పిటిషన్లలో వివరించారు. అనేక పోలీసు స్టేషన్లలో అక్కడి సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, విచారణల పేరిట వేధించడం, ఫిర్యాదులు చేయడానికి వెళ్లిన వారితో దురుసుగా ప్రవ ర్తించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దృష్ట్యా, అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అక్కడ జరిగే వ్యవహారాల్ని నిఘా నేత్రాల ద్వారా కంట్రోల్ రూం, జిల్లా ఎస్పీ, కమిషనర్ల కార్యాలయాలకు అనుసంధానించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ గత నెల విచారించింది.
గత నెల విచారణ సందర్భంలో రిట్‌పిటిషన్ దాఖలు చేస్తూ, నిఘా కెమెరాల ఏర్పాటు వ్యవహారంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని బెంచ్ ఆదేశించింది. అయితే, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది. మంగళవారం ఉదయం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాది టీఎస్ మూర్తి హాజరయ్యారు. రిట్ పిటిషన్ దాఖలకు మరింత సమయం కావాలని విన్నవించారు. ఇందుకు బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే నాలుగు వారాలు సమయం ఇచ్చామని, మళ్లీ సమయం కావాలంటే ఇవ్వబోమని స్పష్టం చేసింది. సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి దాఖలైన ప్రజా వ్యాజ్యంపై ఇంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు తదుపరి విచారణను వాయిదా వేస్తూనే, ప్రభుత్వానికి రూ.10 వేలు జరిమానా విధించారు. రిట్ పిటిషన్ దాఖలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటుగా కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను ఈ జరిమానా విధిస్తున్నామని బెంచ్ స్పష్టం చేసింది. ఈ జరిమానాను ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన ఇద్దరు న్యాయవాదులకు తలా రూ.5 వేలు చొప్పున చెల్లించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.