CM Panneerselvam
-
చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ
♦ నేడు కోర్టు తీర్పు ♦ పోయెస్ గార్డెన్‌కు పోటెత్తిన అభిమానం ♦ కార్యకర్తల్లోకి శశికళ ♦ భద్రత మరింత కట్టుదిట్టం అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ చిన్నమ్మ శశికళ మద్దతుదారుల్లో నెలకొంది. దీంతో రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం చిన్నమ్మకు మద్దతుగా పోయెస్‌గార్డెన్‌కు అభిమానులు పోటెత్తారు. గార్డెన్ నుంచి బయటకు వచ్చిన శశికళ కార్యకర్తలతో ముచ్చటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వంకు మద్దతుగా ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, తారలు, మాజీ ఎమ్మెల్యేలు గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదులుతున్నారు. పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానుల తాకిడి రెండు రోజులుగా గ్రీన్‌వేస్ రోడ్డు వైపుగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం చిన్నమ్మ కువత్తూరు వేదికగా చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తల్ని, నాయకులను కదిలించినట్టుంది. రెండు రోజులుగా అంతంత మాత్రంగానే పోయెస్‌గార్డెన్ పరిసరాల్లో సందడి నెలకొనగా, ప్రస్తుతం అభిమాన కెరటం పోటెత్తుతోంది. శశికళకు మద్దతుగా తండోపతండాలుగా కార్యకర్తలు తరలి రావడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ముందుగా పార్టీ ముఖ్యులతో మాట్లాడే క్రమంలో అమ్మ జయలలిత వెన్నంటి ఉంటూ తాను చేసిన సేవలు, అందించిన సహకారాన్ని వివరించారు. పన్నీరు రూపంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ, ఆ శిబిరం ఎత్తులను చిత్తు చేస్తూ, అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒకే మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. క్రమంగా అభిమాన తాకిడి పెరగడంతో శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బయటకు రాక తప్పలేదు. కార్యకర్తల్లో చొచ్చుకు వస్తూ, వారితో ముచ్చటించారు. కార్యకర్తల మ«ధ్యలో నిలబడి మరీ ప్రసంగ పాఠంతో ఆకర్షించే యత్నం చేశారు. పోయెస్ గార్డెన్ నుంచి కువత్తూరుకు వెళ్లే మార్గంలో ప్రజాకర్షణ దిశలో చిన్నమ్మ పయనం సాగినా, చిన్నమ్మ ప్రసంగాలు ఆకర్షించే విధంగా ఉన్నా, మంగళవారం వెలువడబోయే తీర్పుపై ఆమె మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ మాత్రం తప్పడం లేదు. చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ: అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించనుంది. మంగళవారం పదిన్నర గంటలకు తీర్పును ప్రకటించనున్నట్టు సుప్రీంకోర్టులో నుంచి వెలువడ్డ ప్రకటనతో చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఆందోళన బయల్దేరింది. చిన్నమ్మకు అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందో అన్న చర్చ మీడియాల్లో సైతం పెరగడంతో తీర్పుపై ఆసక్తి పెరిగింది. తీర్పు వ్యతిరేకంగా ఉన్న పక్షంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఏదేని సంఘటనలు చోటు చేసుకోవచ్చన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భద్రత పెంచుతూ, ప్రధాన ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఎవరు ఎటో..
►అంతా ఉత్కంఠే ►ఆసక్తికరంగా తమిళ రాజకీయం ►పన్నీరుకు ప్రజా మద్దతు హోరు... ►చిన్నమ్మకు ఎమ్మెల్యేల అండ ►మళ్లీ యువత ఏకమయ్యేనా? తమిళనాట అధికార రాజకీయం ఆసక్తికరంగా మారింది. అంతా ఉత్కంఠేనన్నట్టుగా బుధవారం రాజకీయ పరిణామాలు సాగాయి. సీఎం పన్నీరుకు ప్రజా మద్దతు హోరెత్తగా, చిన్నమ్మ శశికళకు ఎమ్మెల్యేల అండ వెరసి మున్ముందు సాగనున్న పరిణామాలపై ఆసక్తి పెరిగింది. ఇక, మెరీనా వేదికగా మరో ఉద్యమం రాజుకునేనా అన్న ఉత్కంఠ ఏర్పడింది. సాక్షి, చెన్నై : సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యలతో అన్నాడీఎంకేలో ఏర్పడిన ప్రకంపనలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు దారి తీశాయి. ఇక, తాను ‘రిమోట్’ను కాదు ‘గన్’ అన్నట్టు ఒక్కసారిగా పన్నీరు పేలడం అన్నాడీఎంకేలో కల్లోలాన్ని సృష్టించింది. దీంతో పన్నీరు నిర్ణయాన్ని ఆహ్వానించే వారి సంఖ్య పెరిగింది. అన్నాడీఎంకేలో మాజీ ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్లందరి చూపు పన్నీరు వైపు మరలింది. చిన్నమ్మ శశికళను వ్యతిరేకించే శక్తులన్నీ పన్నీరుకు అండగా నిలబడే రీతిలో చెన్నై వైపుగా రాష్ట్రం నలుమూలల నుంచి కదిలే పనిలో పడ్డాయి. ఎంపీ మైత్రేయన్తోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు పన్నీరుకు మద్దతు నివ్వడం, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్ వంటి మాజీ మంత్రులు ముం దుకు వస్తుండడం వెరసి, మున్ముందు అన్నాడీఎంకేలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయో అన్న ఆసక్తి సర్వత్రా పెరిగింది. అన్నాడీఎంకే రాజకీయా ఎత్తుగడల్ని, సాగుతున్న పరిణామాల్ని ప్రతి పక్షాలే కాదు, ప్రజలు సైతం నిశితంగా పరిశీలించే పనిలో నిమగ్నం కావడం గమనార్హం. పన్నీరుకు మద్దతుగా : బుధవారం ఉదయం నుంచి అటు రాయపేటలో, ఇటు గ్రీన్ వేస్ రోడ్డులోనూ హడావుడి అంతా ఇంతా కాదు. చిన్నమ్మ విశ్వాసులు రాయపేట వైపుగా, పన్నీరు మద్దతుదారులు గ్రీన్‌వేస్ రోడ్డు వైపుగా కదలడంతో ఎవరు ఎటో అన్న చర్చ ఏర్పడింది. చిన్నమ్మ వైపుగా ఎవ్వరెవ్వరు వెళ్లనున్నారో, పన్నీరుకు అండగా తూటాలుగా మారే వాళ్లు ఎవరో అన్న చర్చ ఏర్పడడంతో మీడియాలో వచ్చే సమాచారాల మీద ఆసక్తి జనంలో పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో సైతం పన్నీరు చర్చ హోరెత్తగా, చిన్నమ్మను వ్యతిరేకించే విమర్శల జోరు ఊపందుకుంది. పన్నీరుకు మద్దతుగా సానుభూతి పెరిగినట్టుగా, ప్రజలు తమ స్పందన ను వ్యక్తం చేస్తుండడం బట్టిచూస్తే ప్రజలు ఏ మేరకు రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నారోనన్నది స్పష్టం కాక తప్పదు. ఇక, చిన్నమ్మకు మద్దతుగా మెజారిటీ ఎమ్మెల్యేలు రాయపేటలో అడుగుపెట్టడంతో ఎలాంటి పరిణామాలు మున్ముందు చోటు చేసుకోనున్నాయో, రాజకీయ మలుపులు ఎలా ఉండబోతున్నాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. తలైవా(నాయకుడా)అంటూ పన్నీరుకు బసటగా నిలిచే రీతిలో యువత ముందుకు కదిలే రీతిలో సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారంతో మరో జల్లికట్టు మద్దతు ఉద్యమం అన్నట్టుగా మెరీనా పోటెత్తేనా అన్న ఎదురుచూపులు పెరిగాయి. దీంతో భద్రత కట్టుదిట్టం చేసే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నం కావడం ఆలోచించ దగ్గ విషయం. చిన్నమ్మ రాజకీయం: సీఎం పగ్గాలు లక్ష్యంగా చిన్నమ్మ శశికళ ఓ వైపు తీవ్రంగా పావులు కదుపుతుంటే, మరో వైపు అదే స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత సైతం బయలు దేరుతోంది. పార్టీ ఎమ్మెల్యేల మెజారిటీ మద్దతు తనకు ఉందన్న ధీమా, ఇక, తానే చీఫ్ అన్న థోరణితో ముందుకు సాగినా, వెంటాడే కష్టాలతో సీఎం కూర్చి దరి చేరేనా అన్న చర్చ బయలు దేరింది. ఎమ్మెల్యే మెజారిటీ తమకు ఉందని చాటుకునేందుకు చిన్నమ్మ తీవ్రంగానే ప్రయత్నాల్లో పడ్డా, గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆహ్వానం కరువుతో, ఇక గురువారం రాజకీయ మలుపులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ బయలు దేరింది. చిన్నమ్మ రాజకీయంలో భాగంగా బుధవారం రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల భేటీ సాగినా, వచ్చిన వాళ్లను రక్షించుకునేందుకు తగ్గ నాటకీయ పరిణామాలు ఊపందుకు కోవడం గమనార్హం. వచ్చిన వాళ్లంతే, పన్నీరును తిట్టి పోస్తూ, చిన్నమ్మ మెప్పు పొందేందుకు తీవ్రంగానే మీడియా ముందు దూకుడును ప్రదర్శించక తప్పలేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి, మాజీ మంత్రి బీవీ రమణల్ని కదిలించగా, చిన్నమ్మ సీఎం కావడం తథ్యం అంటూ, పన్నీరు తీరును తీవ్రంగా దుయ్యబట్టే పనిలో పడ్డారు. పన్నీరుకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మల్ని తగల పెట్టేందుకు పలు చోట్ల నాయకులు దూసుకు రావడం, వారి చర్యల్ని ఖండించే విధంగా పన్నీరు మద్దతు దారులు శశికళకు వ్యతిరేకంగా పోరు బాటలు సాగించడం వంటి పరిణామాలతో అన్నాడీఎంకే రాజకీయం మరింతగా రచ్చకెక్కింది. నేతల బాసట : ప్రజలే కాదు, ఆపద్ధర్మ సీఎం పన్నీరుకు మద్దతుగా పలు పార్టీ నాయకులు పెదవి విప్పడం విశేషం. వేర్వేరుగా ఆయా పార్టీల నేతలు స్పందిస్తూ, సీఎం పదవిలో ఉన్న వ్యక్తికే ఇంత కష్టమా అని వ్యాఖ్యానించడం గమనార్హం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ పేర్కొంటూ, తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని సీఎం స్పందించడంపై గవర్నర్ జోక్యంచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు, మెజారిటీ నిరూపణకు తగ్గ చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం ఎంపీ టీకే రంగ రాజన్ పేర్కొంటూ అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ గందరగోళంలో తదుపరి పరిణామాలపై వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజ స్పందిస్తూ, సీఎం చేత బలవంతంగా సంతకం పెట్టించారన్న సమాచారం ప్రజల్లోనూ ప్రకంపనను రేకెత్తించిందన్నారు. ప్రస్తుత పరిస్థితులను గవర్నర్ పరిగణించి, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలి, ప్రజా స్వామ్య పరిరక్షణంలో పన్నీరు అభినందనీయుడని పేర్కొన్నారు. వీసీకే నేత తిరుమావళవన్ మట్లాడుతూ పన్నీరు ప్రకటన తమిళ రాజకీయల్లో ప్రకంపనగా వ్యాఖ్యానించారు. ఇక, అన్నాడీఎంకే రూపంలో స్థిరమై పాలన ప్రజలకు అందేనాఅన్నది అనుమానమేననని పేర్కొన్నారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ పేర్కొంటూ, పన్నీరు సెల్వం వైపుగా ప్రజలు చూస్తున్నారని, ప్రజాస్వామ్య బద్దంగా ఎంపికైన ప్రభుత్వంలో సాగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పేర్కొంటూ పన్నీరు సెల్వం వెనుక ఏ ఒక్క పార్టీ కూడా లేదు అని స్పష్టం చేశారు. ఆయన తాను పడుతున్న మనో వేదనను బయటకు వెల్లగక్కారేగానీ, ఎవరో నడిపిస్తే, నడవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. అన్నాడీఎంకే ఎంపీ, పన్నీరు మద్దతు దారుడు మైత్రేయన్ పేర్కొంటూ, మెజారిటీని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాట నెలకొన్న పరిస్థితులతో ఇకనైనా, శాశ్వత గవర్నర్‌ను నియమించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ద్రవిడ కళగం నేత కీ వీరమణి డిమాండ్ చేశారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు పేర్కొంటూ, ప్రస్తుతం నెలకొన్న సమస్య అన్నాడీఎంకేకు మాత్రమే కాదు అని, తమిళనాడుకు ఎదురైన సమస్యగా వ్యాఖ్యానించారు. తమిళుల మనోభావాన్ని పన్నీరు ప్రతిబింబించారని వెనకేసుకొచ్చారు. -
చిన్నమ్మ మంతనాలు
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ ఆగమేఘాలపై పార్టీ సీనియర్లను పోయెస్ గార్డెన్‌కు పిలిపించారు. సీఎం పన్నీరుసెల్వం తో పాటు పది మందికి పైగా మంత్రులు పోయెస్ గార్డెన్‌కు శుక్రవారం రాత్రి పరుగులు తీశారు. పార్టీ పరంగానూ, జల్లికట్టు విషయంగానూ వీరితో చిన్నమ్మ మంతనాలు సాగాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం పార్టీ పరంగా పట్టుకు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే దూసుకెళ్తోన్నారు. జిల్లాల వారీగా సమీక్షలతో కసరత్తుల్ని ముగించారు. పార్టీ బలోపేతంతో పాటు, ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలకు తగ్గ చర్యల్ని తీసుకుని, ఆ దిశగా ముందుకు సాగే పనిలో ఉన్నారు. అదే సమయంలో చిన్నమ్మ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీపా వెన్నంటి నిలిచే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు దీపా పేరవై బాట పడుతుండడం, తృతీయ శ్రేణి కేడర్ పెద్ద సంఖ్యలో అటు వైపుగా కదులుతుండటంతో వారిని నివారించేందుకు తగ్గవ్యూహ రచనలో చిన్నమ్మ ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పెనలా జల్లికట్టు ఉద్యమం ఎగసి పడడంతో అత్యవసరంగా పరిస్థితిని చిన్నమ్మ సమీక్షించి ఉండడం గమనార్హం. చిన్నమ్మ మంతనాలు : చిన్నమ్మ పార్టీ పగ్గాలు చేపట్టినానంతరం ఆ పార్టీ కోశాధికారి, సీఎం పన్నీరు సెల్వం తీవ్ర సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్టు సంకేతాలుఉన్నాయి. పలువురు మంత్రులు బహిరంగంగానే చిన్నమ్మ మా సీఎం అంటూ స్పందిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నట్టుగా తీవ్ర ప్రచారం రాష్ట్రంలో సాగుతోంది. ఈ సమయంలో ఆగమేఘాలపై సీఎం పన్నీరు సెల్వంను పోయెస్ గార్డెన్‌కు చిన్నమ్మ పిలిపించారు. అలాగే, పది మందికి పైగా మంత్రులు పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కారు. పార్టీలో సీనియర్లతో చర్చ అన్నట్టుగా ఈ సమావేశం సాగినా, సీఎం పన్నీరు సెల్వంతో పాటు సీనియర్ మంత్రులు, ఆయా జిల్లాలకు కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న దిండుగల్ శ్రీనివాసన్, ఎడపాడి పళని స్వామి, తంగమణి, ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్, ఎంసీ సంపత్, కామరాజ్, కడంబూరు రాజు, ఓఎస్ మణి, సరోజ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి గంట పాటు చిన్నమ్మతో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకున్నట్టు చెప్పవచ్చు. ప్రధానంగా పార్టీ , ప్రభుత్వానికి తలవంపులు రానివ్వకుండా జాగ్రత్తలు పడాలని, జల్లికట్టు విషయంలో యువత పెద్ద ఎత్తున ఏకం, కావడం, దీని వెనుక ఉన్న శక్తుల గురించి ఆరా తీసే విధంగా చిన్నమ్మ మంతనాలు సాగి ఉండడం గమనించాల్సిన విషయం. చిన్నమ్మతో భేటీ తదుపరి శనివారం జల్లికట్టు విషయంలో పన్నీరు ప్రభుత్వం ఆగమేఘాల మీద పావుల్ని కదపడం విశేషం. -
చిన్నమ్మ సీఎం?.. అమ్మ దారిలో సెల్వం!
అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళకు ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో పాల్గొన్న తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఆసక్తికరరీతిలో ప్రసంగించారు. తన ప్రసంగమంతా దివంగత నేత అమ్మ జయలలిత సేవలను, కృషిని కొనియాడిన ఆయన.. చిన్నమ్మకు పదవి విషయంలో మౌనం దాల్చారు. 'మా గౌరవనీయులైన జనరల్ సెక్రటరీ చిన్నమ్మ' అని మాత్రమే పేర్కొన్న ఆయన.. తన ప్రసంగం నిండా జయలలిత గురించే మాట్లాడారు. జయలలిత ప్రభుత్వం హయాంలో తమిళనాడు ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. '1991లో జయలలిత తొలిసారి సీఎం అయినప్పుడు తమిళనాడు తలసరి ఆదాయం దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సగటు కన్నా 75శాతం అధికంగా ఉంది' అని తెలిపారు. అమ్మ దారిలోనే సాగుతూ ఆమె విజన్ అయిన 2023 నాటికి తమిళనాడును మరింత అభివృద్ధి చెందేలా చూస్తామని, ఇందుకు అమ్మ తరహాలోనే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని జయలలిత విధేయుడైన సెల్వం పేర్కొన్నారు. 'అమ్మ రూపొందించిన సమ్మిళిత వృద్ధి నమూనానే మేం కూడా అనుసరిస్తాం. అందరికీ అన్నీ దక్కేలా చూస్తాం' అని చెప్పారు. మరోవైపు తమిళనాడు సీఎం పీఠం చిన్నమ్మ చేపట్టడం ఖాయమంటూ ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇండియా టుడే దక్షిణాది సదస్సులో భాగంగా న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన జయలలిత జీవితంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను శశికళ ప్రారంభించారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారి బహిరంగ కార్యక్రమంలో శశికళ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా శశికళ భావోద్వేగానికి గురయ్యారు. అయితే, ఇది జరిగిన కాసేపటికే ప్రసంగించిన పన్వీర్ సెల్వం చిన్నమ్మ ప్రస్తావన పెద్దగా లేకుండా మాట్లాడటం గమనార్హం. అమ్మ దారిలోనే ముఖ్యమంత్రిగా తాను ముందుకుసాగుతానని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సీఎం పదవి కోసం పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య పోటీ నెలకొన్నదనే కథనాలు కూడా వస్తున్నాయి. -
చిన్నమ్మే పార్టీకి పెద్దమ్మ
-
చిన్నమ్మే పార్టీకి పెద్దమ్మ
► అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఏకగ్రీవం ► పోయెస్ గార్డెన్‌కు వెళ్లి తీర్మానాన్ని అందజేసిన సీఎం పన్నీర్‌సెల్వం ► కన్నీళ్లు పెట్టుకున్న శశికళ ► జయ చిత్రపటం ముందు పత్రాలు ఉంచి నివాళి ► మనస్ఫూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు వెల్లడి ► వ్యతిరేకుల నిరసనలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాల్లో అందరూ ఊహించిందే జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎంపిక చేస్తూ గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మనస్ఫూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం జయలలిత ఈనెల 5న మృతిచెందడంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. సీఎంగా పన్నీర్‌సెల్వం బాధ్యతలు చేపట్టడంతో ప్రధాన కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారం చెన్నై శివారున నిర్వహించారు. ఆహ్వానపత్రాలు ఉన్నవారినే సమావేశ ప్రాంగణంలోకి అనుమతించాలన్న నిబంధనను కఠినంగా పాటించారు. గురువారం ఉదయం పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. సీఎం పన్నీర్‌సెల్వం, తంబిదురై, సెంగొట్టయ్యన్ తదితర 280 మంది కార్యనిర్వాహక సభ్యులు హాజరయ్యారు. వేదికపై దివంగత జయలలిత ఫొటో పెట్టి.. ఆమె ఎక్కడికెళ్లినా ఉపయోగించిన ఒక ప్రత్యేక కుర్చీని అక్కడ ఏర్పాటుచేశారు. ముందుగా జయలలిత మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తరువాత 14 తీర్మానాలను ఆమోదించారు. జయలలిత మరణానికి నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించారు. జయలలితకు భారతరత్న, మెగాసెసె, నోబెల్ అవార్డులను ప్రకటించాలని తీర్మానం చేశారు. చివరి తీర్మానంగా ప్రధాన కార్యదర్శి అంశాన్ని తీసుకొచ్చారు. ఏకగ్రీవంగా శశికళ ఎన్నిక.. జయలలిత లేని పరిస్థితిలో ఇక పార్టీకి ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న తలెత్తినప్పుడు ఒకటిన్నర కోటి మందికి పైగా పార్టీ కార్యకర్తల హృదయాల నుంచి శశికళ పేరు మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. ఆ తరువాత అందరి ఆమోదం మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించి, పార్టీ సర్వాధికారాలను శశికళకు అప్పగిస్తూ తీర్మానం చేశారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ పార్టీ ప్రధాన కార్యాలయంలో జనవరి 2న బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. తీర్మానం ఆమోదించిన తరువాత సీఎం పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ పోయెస్‌గార్డెన్ వెళ్లి తీర్మానాల ప్రత్యేక సంచికను శశికళకు అప్పగించారు. తీర్మాన ప్రతులను అందుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న శశికళ వాటిని జయలలిత చిత్ర పటం ముందు ఉంచి నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి బాధ్యతలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని శశికళ అన్నారు. కాగా, శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయగానే పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నిరసన ధ్వనులు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించడం ఆ పార్టీ చరిత్రలో బ్లాక్‌డే అని అమ్ ఆద్మీ తమిళనాడు సమన్వయకర్త వశీకరన్ వ్యాఖ్యానించారు. సమావేశ ప్రాంగణం వెలుపల చెన్నై విల్లివాక్కం మహిళా విభాగం అధ్యక్షురాలు అజిత శశికళ ఎంపికపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవుల కోసం కొందరికి గంట కొడుతున్నారు, మీకు సిగ్గులేదా, మీ పదవి అమ్మ పెట్టిన భిక్ష, మగాళ్లయితే రాజీనామా చేసి మళ్లీ గెలవండి అంటూ నినాదాలు చేశారు. -
కరెంట్ కష్టాలు
సాక్షి, చెన్నై: వర్దా తీరం దాటి రెండు రోజులు అవుతోంది. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా పవర్ కష్టాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా యి. చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతా లు, శివారుల్లోని అన్నీ ప్రాంతాలు మూడో రోజు బుధవారం కూడా అంధకారం లో మునిగాయి. తాగు నీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి. మందకొడిగా శివార్లలో సాగుతున్న సహాయ క చర్యలతో ప్రజల్లో తిరుగుబాటు బయలు దేరిం ది. దీంతో ఆగమేఘాలపై కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో , చెన్నై శివార్లలోని ప్రాంతాల్లో సహాయక చర్యల ముమ్మరానికి మంత్రుల బృం దాన్ని సీఎం పన్నీరుసెల్వం రంగంలోకి దింపారు. వర్దా సృష్టించిన విలయ తాండవం నుంచి చెన్నై నగరంలో కొన్ని ప్రాంతాలు మినహా తక్కినవన్నీ కోలుకుంటున్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పర్వం క్రమంగా సాగుతోంది. డెబ్బై శాతం మేరకు చెన్నైలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో, ఇక్కడి ప్రజలకు కొంత ఊరటే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో పది వేల మంది వరకు ఉన్నారు. వీరికి అన్ని రకాల వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నారు. ఇక, నగరంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కష్టాలు వెంటాడుతున్నా, శివార్లలో మాత్రం జనం పాట్లు వర్ణణాతీతం. ఉత్తర చెన్నై పరిధిలోని మీంజూరు, తిరువొత్తియూరు, కొడుంగయూరు, మధురాంతకం, మూలకడై, మాధవరం పరిసరాల్లో దక్షిణ చెన్నై పరిధిలో ఈసీఆర్, ఓఎంఆర్ పరిసరాలు, నారాయణ పురం, పళ్లికరణై, వేళచ్చేరి, మేడవాక్కం, సంతోపురం, వేంగై వాసల్, అగరం, షోళింగనల్లూరు, నావలూరు, తాంబరం, పెరుంగళత్తూరు, ముడిచ్చూరు, మణివాక్కం ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. తిరుగుబాటు : కాంచీపురం, తిరువళ్లూరు నగరాల్లో ఆగమేఘాల మీద సహాయక చర్యలు సాగుతున్నా, శివారు గ్రామాల్లో పరిస్థితి దారుణం. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు శివార్లలోకి ఇంత వరకు ఏ ఒక్క అధికారి అటు వైపుగా తొంగి చూడలేదని చెప్పవచ్చు. విరిగిన కొమ్మల్ని, నేలకొరిగిన చెట్లను స్థానికులే తొలగించుకోవాల్సిన పరిస్థితి. విరిగి పడ్డ స్తంభాలు, తెగిన తీగలు రోడ్ల మీదే పడి ఉండడం బట్టి చూస్తే, సహాయక చర్యలు ముందుకు సాగడంలేదన్నది స్పష్టం అవుతోంది. మూడు రోజులుగా శివారు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నా, వెలుగు నింపే వాళ్లే లేరు. మరో వారం రోజులు పడుతుందేమో అన్నట్టుగా పరిస్థితులు శివార్లలో నెలకొని ఉన్నాయి. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీళ్లు కరువయ్యాయి. తాగునీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి. తమను ఆదుకునేందుకు ఏ ఒక్కరూ రాకపోవడంతో కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల పరిధి, చెన్నై మహానగర శివారు ప్రాంత వాసులు తీవ్ర ఆక్రోశంతో రగులుతున్నారు. పాల ప్యాకెట్లు, తాగు నీటి కష్టాలు బుధవారం మరింత జఠిలం కావడం, ధరలు పెరగడం వెరసి పాలకుల తీరుపై ప్రజలు తిరుగ బడే పనిలో పడ్డారు. పాల ప్యాకెట్ల ధరలు రెట్టింపయ్యాయి. 20 లీటర్ల తాగు నీరు రూ.యాభై వరకు ధర పలకగా, ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు బిందె నీళ్లు రూ. 20 అని డిమాండ్ చేయడం వెరసి ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహావేశాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల జనం రోడ్డెక్కారు. విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించారు. అక్కడ సమాధానాలు ఇచ్చే వాళ్లే లేని దృష్ట్యా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంధకారంలో మునిగిన ప్రాంతాల్లో వెలుగు కోసం కొవ్వొత్తుల కొనుగోళ్లు పెరిగాయి. కొవ్వొత్తుల కొరత సైతం నెలకొనడంతో, రాత్రుల్లో ఎక్కడ దొంగల స్వైర విహారానికి తాము గురి కావాల్సి ఉంటుందో నన్న బెంగతో బిక్కుబిక్కు మంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. నీటి నిల్వ, పేరుకుపోయిన చెట్ల చెత్తా చెదారాలతో ఎక్కడ రోగాలు ప్రబలుతాయోనన్న ఆందోళన మరో వైపు నెలకొంది. ఇక, సమాచార వ్యవస్థ ఇంకా పునరుద్ధరించని దృష్ట్యా, ఆ కష్టాలు మరో వైపు. కాగా, రాత్రుల్లో ఆకాశంలో వెన్నెల వెలుగు ప్రకాశ వంతంగా ఉండడం శివారు వాసులకు కాస్త ఊరట. మంత్రుల పరుగు : శివారుల్లో ప్రజల్లో ఆక్రోశం రగలడంతో సీఎం పన్నీరు సెల్వం అప్రమత్తం అయ్యారు. మంత్రుల బృందాల్ని రంగంలోకి దించారు. చెన్నైలో సీఎం పన్నీరు సెల్వంతో పాటు ఐదుగురు మంత్రుల బృందం సహాయక చర్యల పర్యవేక్షణలో మునిగాయి. చెన్నై పరిధిలోకి వచ్చే తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల పరిధిలోని ప్రాంతాలు, ఆ రెండు జిల్లాల్లో సహాయక చర్యల ముమ్మరానికి మంత్రుల బృందాల్ని పంపించారు. ఆ మేరకు కాంచీపురం కేసీ వీరమణి, సెల్లూరు రాజు, సరోజ, కేటీ రాజేంద్ర బాలాజీ, ఓఎస్ మణియన్, తిరువళ్లూరు జిల్లా మీంజూరు మంత్రి కామరాజ్, పొన్నేరి విజయభాస్కర్, పలవేర్కాడు అన్భళగన్, పాండియరాజన్, గుమ్మిడి పూండి బెంజిమిన్, చోళవరం వేలుమణి తిష్ట వేసి సహాయక చర్యలు వేగవంతం చేసే పనిలో పడ్డారు.ఇక, శివారుల్లోకి 150 మొబైల్ వైద్య బృందాల్ని పంపించింది, శిబిరాల ఏర్పాటుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. మళ్లీ వాన భయం... నేటి నుంచి స్కూళ్లు : వర్దా తాండవం నుంచి ఇంకా జనం పెద్దగా తేరుకోలేదు. శివారుల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈ సమయంలో మళ్లీ వాన భయం జనంలో మొదలైంది. వర్దా బలహీన పడి కర్ణాటక వైపుగా వెళ్లినా, ఆ ప్రభావం మేరకు రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, చెన్నైకు మరో వాన గండం తప్పదన్నట్టుగా వాట్సాప్ , సోషల్ మీడియాల్లో ప్రచారం హల్చల్ చేస్తుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఇక, గురువారం నుంచి చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో స్కూళ్లను తెరిచేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. -
చిన్నమ్మే మమ్మల్ని నడిపించాలి: సీఎం
చెన్నై: చిన్నమ్మ శశికళే పార్టీ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి అన్నాడీఎంకేను ముందుకు నడిపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదివారం కోరారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని, అలాంటిది ఏదైనా ఉంటే వారు నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలు కారని సెల్వం అన్నట్లు జయ ప్లస్ టీవీ పేర్కొంది. జయలలిత బాధల్లో శశికళ అండగా నిలబడ్డారని సెల్వం అన్నట్లు చెప్పింది. 30 ఏళ్లకు పైగా అమ్మతో కలిసి పనిచేసిన శశికళకు పార్టీని ఎలా నడపాలో తెలుసునని సెల్వం అన్నారు. అంతేకాకుండా అమ్మ లాగే శశికళ పార్టీలోని ప్రతి కార్యకర్తకు తెలుసని చెప్పారు. పార్టీలో పరిపాలన సజావుగా సాగాలంటే కచ్చితంగా చిన్నమ్మే పగ్గాలు అందుకోవాలని పేర్కొన్నారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలని శనివారం పలువురు అన్నాడీఎంకే నేతలు శశికళను కలిసి మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. -
6 శాతం డీఏ పెంపు
18 లక్షల ఉద్యోగులకు లబ్ధి సర్కారుపై అదనపు భారం సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సీఎం పన్నీరు సెల్వం నిర్ణయం తీసుకున్నారు. ఆరు శాతం మేరకు వర్తింప చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. 18 లక్షల ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల డీఏ పెరిగిన విషయం తెలిసిందే. తమకు కూడా డీఏ పెంచాలన్న డిమాండ్‌ను ఉద్యోగులు తెర మీదకు తెచ్చారు. ఓ వైపు తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా ఉద్యోగులు పోరు బాటకు సిద్ధం అవుతున్న సమయంలో వారికి డీఏను పెంచుతూ బుజ్జగించే పనిలో సీఎం పన్నీరు సెల్వం నిమగ్నం అయ్యారు. డీఏ పెంపు: రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది, అంగన్వాడీ, పౌష్టికాహారం తదితర ప్రభుత్వ ప్రత్యేక పథకాల అమల్లో నిమగ్నమైన ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ రంగ, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన తరహాలో డీఏను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు సీఎం పన్నీరు సెల్వం ఆదేశాలతో అధికార వర్గాలు డీఏ పెంపును ప్రకటించాయి. ఆరు శాతం మేరకు డీఏను పెంచుతూ, అందుకు తగ్గ వివరాలతో ప్రకటనను విడుదల చేశారు. వివిధ కేటగిరిల ఆధారంగా రూ.336 నుంచి రూ.4,620 వరకు ఉద్యోగులకు డీఏను పెంచారు. 18 లక్షల మంది సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ఈ డీఏ పెంపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 1212.76 కోట్లు భారం పడనుందని వివరించారు. ఈ పెంపును ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి వర్తింప చేయనున్నారు. తాజా పెంపు మేరకు ప్రస్తుతం రూ. 4800 వరకు జీతం తీసున్న వాళ్లకు ఇక, రూ.1300 డీఏ లభిస్తుంది. అలాగే, రూ.5200 నుంచి 20 వేల వరకు జీతం తీసుకుంటున్న వాళ్లకు 1800 నుంచి 2800 వరకు, 9300 నుంచి 34 వేల వరకు జీతం తీసుకుంటున్న వాళ్లకు 4200 నుంచి 4900 వరకు డీఏ పెరగనుంది. -
సస్పెన్షన్‌లో సవరణ!
అసెంబ్లీ నుంచి డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెండ్ వ్యవహారంలో స్వల్ప మార్పులు జరిగాయి. వారిని ఈ సమావేశాల వరకే సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ధనపాల్ శుక్రవారం ప్రకటించారు. గరం..గరంగా సాగిన సభా పర్వంలో డీఎంకే, పీఎంకే, కాంగ్రెస్, పుదియ తమిళగంలు వాకౌట్ చేశాయి. తమ అమ్మ జయలలిత ప్రగతిని చాటుతూ సీఎం పన్నీరుసెల్వం ప్రత్యేక ప్రకటనలు చేశారు. - స్పీకర్ ధనపాల్ నిర్ణయం - గరం..గరంగా సభా పర్వం సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం ప్రశ్నోత్తరాల మొదలు సభాపర్వం గరం..గరంగానే సాగింది. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని టార్గెట్ చేసి పలువురు మంత్రులు తీవ్రంగానే స్పందించారు. వారి వ్యాఖ్యలకు ఆక్షేపణ తెలుపుతూ, తామేమి తక్కువ తిన్నామా అన్నట్టుగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను టార్గెట్ చేసి డీఎంకే వర్గాలు శివాలెత్తారు. సభా పర్వం అంతా గరంగరంగా సాగినా, చివరకు ప్రతి పక్షాలకు మాట్లాడే అకాశాల్ని స్పీకర్ ధనపాల్ కత్తిరించడం రగడకు దారితీసింది. అధికార పక్షం సభ్యులకు, మంత్రులకు మాట్లాడేందుకు అధిక సమయం కేటాయించే స్పీకర్, తమకు మాత్రం కేటాయించడం లేదంటూ డీఎంకే, పీఎంకే, కాంగ్రెస్, పుదియ తమిళగంలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. డీఎండీకే సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ, వారికి మద్దతుగా నిలిచే విధంగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. చివరకు తమ గళాన్ని నొక్కేస్తుండడంతో అసెంబ్లీ నుంచి తొలుత డీఎంకే, వారి వెంట కాంగ్రెస్, ఆతర్వాత పీఎంకే, పుదియ తమిళగంలు వాకౌట్ చేశాయి. సస్పెన్షన్‌లో సవరణ వాకౌట్ల పర్వం అనంతరం స్పీకర్ ధనపాల్ స్పందించారు. సభలో డీఎండీకే సభ్యులు వ్యవహరించిన తీరును ఎత్తి చూపుతూ, అందుకు తగ్గ ఫొటో, వీడియో క్లిప్పింగ్‌లకు క్రమ శిక్షణా సంఘానికి పంపించామన్నారు. అదే సమయంలో వారిని సభ నుంచి ఈ సమావేశాలతో పాటుగా రానున్నమరో సమావేశాలకు సైతం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తుచేశారు. అయితే, ఆ నిర్ణయంలో స్వల్ప మార్పు చేస్తున్నామన్నారు. ఎవరి ఒత్తిడికో లేదా, మరెవ్వరి ఆగ్రహానికో తలొగ్గి తాను నిర్ణయంలో మార్పు చేయడం లేదన్న విషయాన్ని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిగణించాలని సూచించారు. డీఎండీకే సభ్యులను కేవలం ఈ సమావేశాలకు మాత్రమే సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో తదుపరి సమావేశాలకు డీఎండీకే సభ్యులు సభకు హాజరు కావచ్చు. ఇప్పటికే నాలుగు రోజుల సభలో మూడు రోజులు ముగియడంతో ఇక వాళ్లు వస్తే, ఏమి రాకుంటే ఏమి అన్న పెదవి విప్పే వాళ్లే సభా మందిరం పరిసరాల్లో అధికం. మిగులు విద్యుత్ అసెంబ్లీలో మంత్రులతో పాటుగా సీఎం పన్నీరు సెల్వం ప్రసంగించారు. రవాణా మంత్రి సెంథిల్ బాలాజా ప్రసంగించే క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి చెన్నైకు యాభై ఏసీ బస్సుల్ని నడపబోతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ మంత్రి అగ్రి కృష్ణమూర్తి ప్రసంగిస్తూ, బయోడీజిల్ పై ప్రయోగం వేగవంతం అయిందని, పరిశోధనలు పూర్తికాగానే, వాహనాలకు ఆ డీజిల్ వినియోగంపై చర్యలు చేపట్టనున్నామన్నారు. దేవాదాయ శాఖ ఇన్చార్జ్ మంత్రి కామరాజ్ ప్రసంగిస్తూ, నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఆరు వేల 972 ఆలయాల్ని పునరుద్ధరించి కుంభాభిషేకాలు నిర్వహించామని వివరించారు. సీఎం పన్నీరు సెల్వం ప్రసంగిస్తూ, రాష్ట్రంలో గాడ్సె విగ్రహాల ఏర్పాటుకు హిందూ మహా సభ చర్యలకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో అలాంటి విగ్రహాలు ఎక్కడ ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదని, ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ను మరికొన్ని నెలల్లో చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తమ అమ్మ చేపట్టిన ముందస్తు ప్రయత్నాలు, ప్రాజెక్టులు ఫలాల్ని ఇస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో 22 వేల మెగావాట్ల విద్యుత్‌ను చూడబోతున్నామని, త్వరలో ఇది సాకారం కావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 16 వేల మెగావాట్లు, ఇతర కేంద్రాల ద్వారా రెండు మూడు వేల మెగావాట్లు, బయటి నుంచి కొనుగోళ్ల ద్వారా మూడు వేల మూడు వందల మెగావాట్ల రూపంలో ఈ విద్యుత్ రాష్ట్రానికి దక్కనున్నదని వివరించారు. రోజుల తరబడి నిరవధిక దీక్షలో ఉన్న ఉద్యాన వన వర్సిటీ విద్యార్థుల దీక్షపై స్పందిస్తూ, వారితో చర్చలకు చర్యలు చేపట్టామన్నారు. -
సర్కారుకు జరిమానా
సాక్షి, చెన్నై :సీఎం పన్నీరు సెల్వం సర్కారుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా మండి పడింది. సీసీ కెమెరాల ఏర్పాటు వ్యవహారంలో నిర్లక్ష్యం ఏమిటంటూ ఆ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. రూ.పదివేలు జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని కట్టాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో రాష్ట్రంలో సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని, ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పాల న అధ్వానంగా మారిందన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వం, కోర్టు వ్యవహారాల్లోను అదే బాటలో పయనిస్తున్నట్టుంది. రిట్ పిటిషన్ల దాఖలులో జాప్యంపై కోర్టులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. గత నెల రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఓ కేసు విషయంలో రూ.పది వేలు జరిమానా విధించింది. పలు కేసు విషయాల్లో అక్షింతలు పడుతున్నాయి. ఈ వ్యవహారాలు మరువక ముందే, మళ్లీ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో పాటుగా రూ.10 వేలు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. పిటిషన్: నగరానికి చెందిన న్యాయవాది పి ప్రకాష్‌రాజ్, నారాయణన్ కలిసి ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పోలీసు స్టేషన్లలో సాగుతున్న వ్యవహారాలు, లాకప్ డెత్ ఘటనల్ని తమ పిటిషన్లలో వివరించారు. అనేక పోలీసు స్టేషన్లలో అక్కడి సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, విచారణల పేరిట వేధించడం, ఫిర్యాదులు చేయడానికి వెళ్లిన వారితో దురుసుగా ప్రవ ర్తించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దృష్ట్యా, అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అక్కడ జరిగే వ్యవహారాల్ని నిఘా నేత్రాల ద్వారా కంట్రోల్ రూం, జిల్లా ఎస్పీ, కమిషనర్ల కార్యాలయాలకు అనుసంధానించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ గత నెల విచారించింది. గత నెల విచారణ సందర్భంలో రిట్‌పిటిషన్ దాఖలు చేస్తూ, నిఘా కెమెరాల ఏర్పాటు వ్యవహారంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని బెంచ్ ఆదేశించింది. అయితే, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది. మంగళవారం ఉదయం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాది టీఎస్ మూర్తి హాజరయ్యారు. రిట్ పిటిషన్ దాఖలకు మరింత సమయం కావాలని విన్నవించారు. ఇందుకు బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే నాలుగు వారాలు సమయం ఇచ్చామని, మళ్లీ సమయం కావాలంటే ఇవ్వబోమని స్పష్టం చేసింది. సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి దాఖలైన ప్రజా వ్యాజ్యంపై ఇంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు తదుపరి విచారణను వాయిదా వేస్తూనే, ప్రభుత్వానికి రూ.10 వేలు జరిమానా విధించారు. రిట్ పిటిషన్ దాఖలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటుగా కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను ఈ జరిమానా విధిస్తున్నామని బెంచ్ స్పష్టం చేసింది. ఈ జరిమానాను ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన ఇద్దరు న్యాయవాదులకు తలా రూ.5 వేలు చొప్పున చెల్లించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.