సస్పెన్షన్‌లో సవరణ! | Bedlam in Assembly, DMDK members suspended | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్‌లో సవరణ!

Published Sat, Feb 21 2015 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

Bedlam in Assembly, DMDK members suspended

అసెంబ్లీ నుంచి డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెండ్ వ్యవహారంలో స్వల్ప మార్పులు జరిగాయి. వారిని ఈ సమావేశాల వరకే సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ధనపాల్ శుక్రవారం ప్రకటించారు. గరం..గరంగా సాగిన సభా పర్వంలో డీఎంకే, పీఎంకే, కాంగ్రెస్, పుదియ తమిళగంలు వాకౌట్ చేశాయి. తమ అమ్మ జయలలిత ప్రగతిని చాటుతూ సీఎం పన్నీరుసెల్వం ప్రత్యేక ప్రకటనలు చేశారు.    
 
- స్పీకర్ ధనపాల్ నిర్ణయం   
- గరం..గరంగా సభా పర్వం

సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం ప్రశ్నోత్తరాల మొదలు సభాపర్వం గరం..గరంగానే సాగింది. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని టార్గెట్ చేసి పలువురు మంత్రులు తీవ్రంగానే స్పందించారు. వారి వ్యాఖ్యలకు ఆక్షేపణ తెలుపుతూ, తామేమి తక్కువ తిన్నామా అన్నట్టుగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను టార్గెట్ చేసి డీఎంకే వర్గాలు శివాలెత్తారు.

సభా పర్వం అంతా గరంగరంగా సాగినా, చివరకు ప్రతి పక్షాలకు మాట్లాడే అకాశాల్ని స్పీకర్ ధనపాల్ కత్తిరించడం రగడకు దారితీసింది. అధికార పక్షం సభ్యులకు, మంత్రులకు మాట్లాడేందుకు అధిక సమయం కేటాయించే స్పీకర్, తమకు మాత్రం కేటాయించడం లేదంటూ డీఎంకే, పీఎంకే, కాంగ్రెస్, పుదియ తమిళగంలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. డీఎండీకే సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ, వారికి మద్దతుగా నిలిచే విధంగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. చివరకు తమ గళాన్ని నొక్కేస్తుండడంతో అసెంబ్లీ నుంచి తొలుత డీఎంకే, వారి వెంట కాంగ్రెస్, ఆతర్వాత పీఎంకే, పుదియ తమిళగంలు వాకౌట్ చేశాయి.
 
సస్పెన్షన్‌లో సవరణ
వాకౌట్ల పర్వం అనంతరం స్పీకర్ ధనపాల్ స్పందించారు. సభలో డీఎండీకే సభ్యులు వ్యవహరించిన తీరును ఎత్తి చూపుతూ, అందుకు తగ్గ ఫొటో, వీడియో క్లిప్పింగ్‌లకు క్రమ శిక్షణా సంఘానికి పంపించామన్నారు. అదే సమయంలో వారిని సభ నుంచి ఈ సమావేశాలతో పాటుగా రానున్నమరో సమావేశాలకు సైతం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తుచేశారు. అయితే, ఆ నిర్ణయంలో స్వల్ప మార్పు చేస్తున్నామన్నారు. ఎవరి ఒత్తిడికో లేదా, మరెవ్వరి ఆగ్రహానికో తలొగ్గి తాను నిర్ణయంలో మార్పు చేయడం లేదన్న విషయాన్ని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిగణించాలని సూచించారు. డీఎండీకే సభ్యులను కేవలం ఈ సమావేశాలకు మాత్రమే సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో తదుపరి సమావేశాలకు డీఎండీకే సభ్యులు సభకు హాజరు కావచ్చు. ఇప్పటికే నాలుగు రోజుల సభలో మూడు రోజులు ముగియడంతో ఇక వాళ్లు  వస్తే, ఏమి రాకుంటే ఏమి అన్న పెదవి విప్పే వాళ్లే సభా మందిరం పరిసరాల్లో అధికం.
 
మిగులు విద్యుత్
అసెంబ్లీలో మంత్రులతో పాటుగా సీఎం పన్నీరు సెల్వం ప్రసంగించారు. రవాణా మంత్రి సెంథిల్ బాలాజా ప్రసంగించే క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి చెన్నైకు యాభై ఏసీ బస్సుల్ని నడపబోతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ మంత్రి అగ్రి కృష్ణమూర్తి ప్రసంగిస్తూ, బయోడీజిల్ పై ప్రయోగం వేగవంతం అయిందని, పరిశోధనలు పూర్తికాగానే, వాహనాలకు ఆ డీజిల్ వినియోగంపై చర్యలు చేపట్టనున్నామన్నారు. దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి కామరాజ్ ప్రసంగిస్తూ, నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఆరు వేల 972 ఆలయాల్ని పునరుద్ధరించి కుంభాభిషేకాలు నిర్వహించామని వివరించారు. సీఎం పన్నీరు సెల్వం ప్రసంగిస్తూ, రాష్ట్రంలో గాడ్సె విగ్రహాల ఏర్పాటుకు హిందూ మహా సభ చర్యలకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో అలాంటి విగ్రహాలు ఎక్కడ ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదని, ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు.

రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ను మరికొన్ని నెలల్లో చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తమ అమ్మ చేపట్టిన ముందస్తు ప్రయత్నాలు, ప్రాజెక్టులు ఫలాల్ని ఇస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో 22 వేల మెగావాట్ల విద్యుత్‌ను చూడబోతున్నామని, త్వరలో ఇది సాకారం కావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 16 వేల మెగావాట్లు, ఇతర కేంద్రాల ద్వారా రెండు మూడు వేల మెగావాట్లు, బయటి నుంచి కొనుగోళ్ల ద్వారా మూడు వేల మూడు వందల మెగావాట్ల రూపంలో ఈ విద్యుత్ రాష్ట్రానికి దక్కనున్నదని వివరించారు. రోజుల తరబడి నిరవధిక దీక్షలో ఉన్న  ఉద్యాన వన వర్సిటీ విద్యార్థుల దీక్షపై స్పందిస్తూ, వారితో చర్చలకు చర్యలు చేపట్టామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement