అసెంబ్లీకి పట్టు
♦ స్పీకర్‌పై స్టాలిన్ ఒత్తిడి
♦ అంతర్గత సమరంలో జోక్యం చేసుకోం
♦ ఫెరా...మాఫియా..
♦ ప్రతిపక్ష నేత వ్యాఖ్య
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీని సమావేశ పరచాలని స్పీకర్ ధనపాల్‌పై ప్రధాన ప్రతి పక్షం ఒత్తిడి తెచ్చే పనిలో పడింది. ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం వినతి పత్రం సమర్పించారు. అన్నాడీఎంకే అంతర్గత సమరంలో తాము జోక్యం చేసుకోమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం లో కరువు తాండవం ఓ వైపు, భానుడి ఉగ్ర తాండవం మరోవైపు అన్ని వర్గాల్ని పిండి పిప్పి చేస్తున్న విషయం తెలిసిందే.
అన్నదాతలకు మద్దతుగా రాష్ట్ర బంద్‌కు సైతం ప్రధాన ప్రతిపక్షం నేతృత్వంలో ప్రతి పక్షాలు పిలుపునిచ్చాయి. ప్రజలు తల్లడిల్లుతున్నా, వాటితో తమకేంటి అన్నట్టుగా అధికార పక్షం మెతక వైఖరిని అనుసరిస్తున్నదని ప్రతి పక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకోవడంలో భాగంగా వ్యక్తిగత స్వలాభంలో మునిగి పాలనను, ప్రజల్ని సీఎంతో పాటు మంత్రులు పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశ పరచాలని స్పీకర్‌పై ప్రధాన ప్రతిపక్షం ఒత్తిడికి సిద్ధమైంది.
అసెంబ్లీకి పట్టు: ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఉపనేత దురై మురుగన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉదయం అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ ధనపాల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు, రైతు సమస్యలు, తాగు నీటి ఎద్దడి అంశాలపై చర్చించి ప్రత్యేక సమావేశానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు తగ్గ వినతి పత్రాన్ని స్పీకర్‌కు సమర్పించారు. త్వరితగతిన అసెంబ్లీని సమావేశ పరిచే విధంగా చర్యలు వేగవంతం చేయాలని పట్టుబట్టారు.
జోక్యం చేసుకోం: మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారని వివరించారు. ప్రధానంగా రైతులు ఇక్కడ సాగించిన పోరాటాలకు స్పందనలేని దృష్ట్యా, చివరకు ఢిల్లీ వెళ్లి మరీ పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. తాగు నీటి కోసం గ్రామాల్లో సైతం జనం కిలో మీటర్ల కొద్ది పయనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడి ందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే, వాటి మీద దృష్టి సారించాల్సిన పాలకులు వారి పార్టీ అంతర్గత సమరంలో నుంచి బయట పడే మార్గాల అన్వేషణలో మునిగి ఉండడం విచారకరం అని మండిపడ్డారు.అన్నాడిఎంకే అంతర్గత సమరంలో తాము జోక్యం చేసుకోమని, ఇది డిఎంకే సిద్ధం కాదన్నారు. అయితే, వ్యక్తి్తగత స్వలాభం,పార్టీలో ఆధిపత్యం కోసం ప్రాకులాడుతూ ప్రజల్ని విస్మరిస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు.