చిన్నమ్మే మమ్మల్ని నడిపించాలి: సీఎం
చెన్నై: చిన్నమ్మ శశికళే పార్టీ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి అన్నాడీఎంకేను ముందుకు నడిపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదివారం కోరారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని, అలాంటిది ఏదైనా ఉంటే వారు నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలు కారని సెల్వం అన్నట్లు జయ ప్లస్ టీవీ పేర్కొంది. జయలలిత బాధల్లో శశికళ అండగా నిలబడ్డారని సెల్వం అన్నట్లు చెప్పింది. 30 ఏళ్లకు పైగా అమ్మతో కలిసి పనిచేసిన శశికళకు పార్టీని ఎలా నడపాలో తెలుసునని సెల్వం అన్నారు.
అంతేకాకుండా అమ్మ లాగే శశికళ పార్టీలోని ప్రతి కార్యకర్తకు తెలుసని చెప్పారు. పార్టీలో పరిపాలన సజావుగా సాగాలంటే కచ్చితంగా చిన్నమ్మే పగ్గాలు అందుకోవాలని పేర్కొన్నారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలని శనివారం పలువురు అన్నాడీఎంకే నేతలు శశికళను కలిసి మొరపెట్టుకున్న విషయం తెలిసిందే.