చిన్నమ్మే పార్టీకి పెద్దమ్మ
► అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఏకగ్రీవం
► పోయెస్ గార్డెన్‌కు వెళ్లి తీర్మానాన్ని
అందజేసిన సీఎం పన్నీర్‌సెల్వం
► కన్నీళ్లు పెట్టుకున్న శశికళ
► జయ చిత్రపటం ముందు పత్రాలు ఉంచి నివాళి
► మనస్ఫూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు వెల్లడి
► వ్యతిరేకుల నిరసనలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాల్లో అందరూ ఊహించిందే జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎంపిక చేస్తూ గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మనస్ఫూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం జయలలిత ఈనెల 5న మృతిచెందడంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. సీఎంగా పన్నీర్‌సెల్వం బాధ్యతలు చేపట్టడంతో ప్రధాన కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారం చెన్నై శివారున నిర్వహించారు. ఆహ్వానపత్రాలు ఉన్నవారినే సమావేశ ప్రాంగణంలోకి అనుమతించాలన్న నిబంధనను కఠినంగా పాటించారు.
గురువారం ఉదయం పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. సీఎం పన్నీర్‌సెల్వం, తంబిదురై, సెంగొట్టయ్యన్ తదితర 280 మంది కార్యనిర్వాహక సభ్యులు హాజరయ్యారు. వేదికపై దివంగత జయలలిత ఫొటో పెట్టి.. ఆమె ఎక్కడికెళ్లినా ఉపయోగించిన ఒక ప్రత్యేక కుర్చీని అక్కడ ఏర్పాటుచేశారు. ముందుగా జయలలిత మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తరువాత 14 తీర్మానాలను ఆమోదించారు. జయలలిత మరణానికి నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించారు. జయలలితకు భారతరత్న, మెగాసెసె, నోబెల్ అవార్డులను ప్రకటించాలని తీర్మానం చేశారు. చివరి తీర్మానంగా ప్రధాన కార్యదర్శి అంశాన్ని తీసుకొచ్చారు.
ఏకగ్రీవంగా శశికళ ఎన్నిక..
జయలలిత లేని పరిస్థితిలో ఇక పార్టీకి ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న తలెత్తినప్పుడు ఒకటిన్నర కోటి మందికి పైగా పార్టీ కార్యకర్తల హృదయాల నుంచి శశికళ పేరు మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. ఆ తరువాత అందరి ఆమోదం మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించి, పార్టీ సర్వాధికారాలను శశికళకు అప్పగిస్తూ తీర్మానం చేశారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ పార్టీ ప్రధాన కార్యాలయంలో జనవరి 2న బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. తీర్మానం ఆమోదించిన తరువాత సీఎం పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ పోయెస్‌గార్డెన్ వెళ్లి తీర్మానాల ప్రత్యేక సంచికను శశికళకు అప్పగించారు. తీర్మాన ప్రతులను అందుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న శశికళ వాటిని జయలలిత చిత్ర పటం ముందు ఉంచి నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి బాధ్యతలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని శశికళ అన్నారు. కాగా, శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయగానే పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
నిరసన ధ్వనులు..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించడం ఆ పార్టీ చరిత్రలో బ్లాక్‌డే అని అమ్ ఆద్మీ తమిళనాడు సమన్వయకర్త వశీకరన్ వ్యాఖ్యానించారు. సమావేశ ప్రాంగణం వెలుపల చెన్నై విల్లివాక్కం మహిళా విభాగం అధ్యక్షురాలు అజిత శశికళ ఎంపికపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవుల కోసం కొందరికి గంట కొడుతున్నారు, మీకు సిగ్గులేదా, మీ పదవి అమ్మ పెట్టిన భిక్ష, మగాళ్లయితే రాజీనామా చేసి మళ్లీ గెలవండి అంటూ నినాదాలు చేశారు.