ఎవరు ఎటో.. | aiadmk mlas support to Sasikala vs Pannerselvam | Sakshi
Sakshi News home page

ఎవరు ఎటో..

Published Thu, Feb 9 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

ఎవరు ఎటో..

ఎవరు ఎటో..

అంతా ఉత్కంఠే
ఆసక్తికరంగా తమిళ రాజకీయం
పన్నీరుకు ప్రజా మద్దతు హోరు...
చిన్నమ్మకు ఎమ్మెల్యేల అండ
మళ్లీ యువత ఏకమయ్యేనా?


తమిళనాట అధికార రాజకీయం ఆసక్తికరంగా మారింది. అంతా ఉత్కంఠేనన్నట్టుగా బుధవారం రాజకీయ పరిణామాలు సాగాయి. సీఎం పన్నీరుకు ప్రజా మద్దతు హోరెత్తగా,  చిన్నమ్మ శశికళకు ఎమ్మెల్యేల అండ వెరసి మున్ముందు సాగనున్న పరిణామాలపై ఆసక్తి పెరిగింది. ఇక, మెరీనా వేదికగా మరో ఉద్యమం రాజుకునేనా అన్న ఉత్కంఠ  ఏర్పడింది.

సాక్షి, చెన్నై : సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యలతో అన్నాడీఎంకేలో ఏర్పడిన ప్రకంపనలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు దారి తీశాయి. ఇక, తాను ‘రిమోట్‌’ను కాదు ‘గన్‌’ అన్నట్టు ఒక్కసారిగా పన్నీరు పేలడం అన్నాడీఎంకేలో కల్లోలాన్ని సృష్టించింది. దీంతో పన్నీరు నిర్ణయాన్ని ఆహ్వానించే వారి సంఖ్య పెరిగింది. అన్నాడీఎంకేలో మాజీ ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్లందరి చూపు పన్నీరు వైపు మరలింది. చిన్నమ్మ శశికళను వ్యతిరేకించే శక్తులన్నీ పన్నీరుకు అండగా నిలబడే రీతిలో చెన్నై వైపుగా రాష్ట్రం నలుమూలల నుంచి కదిలే పనిలో పడ్డాయి. ఎంపీ మైత్రేయన్‌తోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు పన్నీరుకు మద్దతు నివ్వడం, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్‌ వంటి మాజీ మంత్రులు ముం దుకు వస్తుండడం వెరసి, మున్ముందు అన్నాడీఎంకేలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయో అన్న ఆసక్తి సర్వత్రా పెరిగింది. అన్నాడీఎంకే రాజకీయా ఎత్తుగడల్ని, సాగుతున్న పరిణామాల్ని ప్రతి పక్షాలే కాదు, ప్రజలు సైతం నిశితంగా పరిశీలించే పనిలో నిమగ్నం కావడం గమనార్హం.

పన్నీరుకు మద్దతుగా :
బుధవారం ఉదయం నుంచి అటు రాయపేటలో, ఇటు గ్రీన్‌ వేస్‌ రోడ్డులోనూ హడావుడి అంతా ఇంతా కాదు. చిన్నమ్మ విశ్వాసులు రాయపేట వైపుగా, పన్నీరు మద్దతుదారులు గ్రీన్‌వేస్‌ రోడ్డు వైపుగా కదలడంతో ఎవరు ఎటో అన్న చర్చ ఏర్పడింది. చిన్నమ్మ వైపుగా ఎవ్వరెవ్వరు వెళ్లనున్నారో, పన్నీరుకు అండగా తూటాలుగా మారే వాళ్లు ఎవరో అన్న చర్చ ఏర్పడడంతో మీడియాలో వచ్చే సమాచారాల మీద ఆసక్తి జనంలో పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో సైతం పన్నీరు చర్చ హోరెత్తగా, చిన్నమ్మను వ్యతిరేకించే విమర్శల జోరు ఊపందుకుంది. పన్నీరుకు మద్దతుగా సానుభూతి పెరిగినట్టుగా, ప్రజలు తమ స్పందన ను వ్యక్తం చేస్తుండడం బట్టిచూస్తే ప్రజలు ఏ మేరకు రాజకీయాల్ని నిశితంగా        పరిశీలిస్తున్నారోనన్నది స్పష్టం కాక తప్పదు.

ఇక, చిన్నమ్మకు మద్దతుగా మెజారిటీ ఎమ్మెల్యేలు రాయపేటలో అడుగుపెట్టడంతో ఎలాంటి పరిణామాలు మున్ముందు చోటు చేసుకోనున్నాయో, రాజకీయ మలుపులు ఎలా ఉండబోతున్నాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. తలైవా(నాయకుడా)అంటూ పన్నీరుకు బసటగా నిలిచే రీతిలో యువత ముందుకు కదిలే రీతిలో సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారంతో మరో జల్లికట్టు మద్దతు ఉద్యమం అన్నట్టుగా మెరీనా పోటెత్తేనా అన్న ఎదురుచూపులు పెరిగాయి. దీంతో భద్రత కట్టుదిట్టం చేసే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నం కావడం ఆలోచించ దగ్గ విషయం.

చిన్నమ్మ రాజకీయం:  సీఎం పగ్గాలు లక్ష్యంగా చిన్నమ్మ శశికళ ఓ వైపు తీవ్రంగా పావులు కదుపుతుంటే, మరో వైపు అదే స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత సైతం బయలు దేరుతోంది. పార్టీ ఎమ్మెల్యేల మెజారిటీ మద్దతు తనకు ఉందన్న ధీమా, ఇక, తానే చీఫ్‌ అన్న థోరణితో ముందుకు సాగినా, వెంటాడే కష్టాలతో సీఎం కూర్చి దరి చేరేనా అన్న చర్చ బయలు దేరింది. ఎమ్మెల్యే మెజారిటీ తమకు ఉందని చాటుకునేందుకు చిన్నమ్మ తీవ్రంగానే ప్రయత్నాల్లో పడ్డా, గవర్నర్‌(ఇన్‌) సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆహ్వానం కరువుతో, ఇక గురువారం రాజకీయ మలుపులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ బయలు దేరింది. చిన్నమ్మ రాజకీయంలో భాగంగా బుధవారం రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల భేటీ సాగినా, వచ్చిన వాళ్లను రక్షించుకునేందుకు తగ్గ నాటకీయ పరిణామాలు ఊపందుకు కోవడం గమనార్హం.

 వచ్చిన వాళ్లంతే, పన్నీరును తిట్టి పోస్తూ, చిన్నమ్మ మెప్పు పొందేందుకు తీవ్రంగానే మీడియా ముందు దూకుడును ప్రదర్శించక తప్పలేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి, మాజీ మంత్రి బీవీ రమణల్ని కదిలించగా, చిన్నమ్మ సీఎం కావడం తథ్యం అంటూ, పన్నీరు తీరును తీవ్రంగా దుయ్యబట్టే పనిలో పడ్డారు. పన్నీరుకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మల్ని తగల పెట్టేందుకు పలు చోట్ల నాయకులు దూసుకు రావడం, వారి చర్యల్ని ఖండించే విధంగా పన్నీరు మద్దతు దారులు శశికళకు వ్యతిరేకంగా పోరు బాటలు సాగించడం వంటి పరిణామాలతో అన్నాడీఎంకే రాజకీయం మరింతగా రచ్చకెక్కింది.

నేతల బాసట :
 ప్రజలే కాదు, ఆపద్ధర్మ సీఎం పన్నీరుకు మద్దతుగా పలు పార్టీ నాయకులు పెదవి విప్పడం విశేషం. వేర్వేరుగా ఆయా పార్టీల నేతలు స్పందిస్తూ, సీఎం పదవిలో ఉన్న వ్యక్తికే ఇంత కష్టమా అని వ్యాఖ్యానించడం గమనార్హం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ పేర్కొంటూ, తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని సీఎం స్పందించడంపై గవర్నర్‌ జోక్యంచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు, మెజారిటీ నిరూపణకు తగ్గ చర్యలు తీసుకోవాలని కోరారు.

 సీపీఎం ఎంపీ టీకే రంగ రాజన్‌ పేర్కొంటూ అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ గందరగోళంలో తదుపరి పరిణామాలపై వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌ రాజ స్పందిస్తూ, సీఎం చేత బలవంతంగా సంతకం పెట్టించారన్న సమాచారం ప్రజల్లోనూ ప్రకంపనను రేకెత్తించిందన్నారు. ప్రస్తుత పరిస్థితులను గవర్నర్‌ పరిగణించి, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలి, ప్రజా స్వామ్య పరిరక్షణంలో పన్నీరు అభినందనీయుడని పేర్కొన్నారు. వీసీకే నేత తిరుమావళవన్‌ మట్లాడుతూ పన్నీరు ప్రకటన తమిళ రాజకీయల్లో ప్రకంపనగా వ్యాఖ్యానించారు.

ఇక, అన్నాడీఎంకే రూపంలో స్థిరమై పాలన ప్రజలకు అందేనాఅన్నది అనుమానమేననని పేర్కొన్నారు. తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌ పేర్కొంటూ, పన్నీరు సెల్వం వైపుగా ప్రజలు చూస్తున్నారని, ప్రజాస్వామ్య బద్దంగా ఎంపికైన ప్రభుత్వంలో సాగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ పేర్కొంటూ పన్నీరు సెల్వం వెనుక ఏ ఒక్క పార్టీ కూడా లేదు అని స్పష్టం చేశారు. ఆయన తాను పడుతున్న మనో వేదనను బయటకు వెల్లగక్కారేగానీ, ఎవరో నడిపిస్తే, నడవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు.

అన్నాడీఎంకే ఎంపీ, పన్నీరు మద్దతు దారుడు మైత్రేయన్‌ పేర్కొంటూ, మెజారిటీని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాట నెలకొన్న పరిస్థితులతో ఇకనైనా, శాశ్వత గవర్నర్‌ను నియమించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ద్రవిడ కళగం నేత కీ వీరమణి డిమాండ్‌ చేశారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు పేర్కొంటూ, ప్రస్తుతం నెలకొన్న సమస్య అన్నాడీఎంకేకు మాత్రమే కాదు అని, తమిళనాడుకు ఎదురైన సమస్యగా వ్యాఖ్యానించారు. తమిళుల మనోభావాన్ని పన్నీరు ప్రతిబింబించారని వెనకేసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement