18 లక్షల ఉద్యోగులకు లబ్ధి
సర్కారుపై అదనపు భారం
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సీఎం పన్నీరు సెల్వం నిర్ణయం తీసుకున్నారు. ఆరు శాతం మేరకు వర్తింప చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. 18 లక్షల ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల డీఏ పెరిగిన విషయం తెలిసిందే. తమకు కూడా డీఏ పెంచాలన్న డిమాండ్‌ను ఉద్యోగులు తెర మీదకు తెచ్చారు. ఓ వైపు తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా ఉద్యోగులు పోరు బాటకు సిద్ధం అవుతున్న సమయంలో వారికి డీఏను పెంచుతూ బుజ్జగించే పనిలో సీఎం పన్నీరు సెల్వం నిమగ్నం అయ్యారు.
డీఏ పెంపు: రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది, అంగన్‌వాడీ, పౌష్టికాహారం తదితర ప్రభుత్వ ప్రత్యేక పథకాల అమల్లో నిమగ్నమైన ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ రంగ, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన తరహాలో డీఏను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు సీఎం పన్నీరు సెల్వం ఆదేశాలతో అధికార వర్గాలు డీఏ పెంపును ప్రకటించాయి. ఆరు శాతం మేరకు డీఏను పెంచుతూ, అందుకు తగ్గ వివరాలతో ప్రకటనను విడుదల చేశారు.
వివిధ కేటగిరిల ఆధారంగా రూ.336 నుంచి రూ.4,620 వరకు ఉద్యోగులకు డీఏను పెంచారు. 18 లక్షల మంది సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ఈ డీఏ పెంపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 1212.76 కోట్లు భారం పడనుందని వివరించారు. ఈ పెంపును ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి వర్తింప చేయనున్నారు. తాజా పెంపు మేరకు ప్రస్తుతం రూ. 4800 వరకు జీతం తీసున్న వాళ్లకు ఇక, రూ.1300 డీఏ లభిస్తుంది. అలాగే, రూ.5200 నుంచి 20 వేల వరకు జీతం తీసుకుంటున్న వాళ్లకు 1800 నుంచి 2800 వరకు, 9300 నుంచి 34 వేల వరకు జీతం తీసుకుంటున్న వాళ్లకు 4200 నుంచి 4900 వరకు డీఏ పెరగనుంది.
6 శాతం డీఏ పెంపు
Published Thu, Apr 23 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement