చిన్నమ్మ సీఎం?.. అమ్మ దారిలో సెల్వం!
అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళకు ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో పాల్గొన్న తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఆసక్తికరరీతిలో ప్రసంగించారు. తన ప్రసంగమంతా దివంగత నేత అమ్మ జయలలిత సేవలను, కృషిని కొనియాడిన ఆయన.. చిన్నమ్మకు పదవి విషయంలో మౌనం దాల్చారు. 'మా గౌరవనీయులైన జనరల్ సెక్రటరీ చిన్నమ్మ' అని మాత్రమే పేర్కొన్న ఆయన.. తన ప్రసంగం నిండా జయలలిత గురించే మాట్లాడారు. జయలలిత ప్రభుత్వం హయాంలో తమిళనాడు ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
'1991లో జయలలిత తొలిసారి సీఎం అయినప్పుడు తమిళనాడు తలసరి ఆదాయం దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సగటు కన్నా 75శాతం అధికంగా ఉంది' అని తెలిపారు. అమ్మ దారిలోనే సాగుతూ ఆమె విజన్ అయిన 2023 నాటికి తమిళనాడును మరింత అభివృద్ధి చెందేలా చూస్తామని, ఇందుకు అమ్మ తరహాలోనే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని జయలలిత విధేయుడైన సెల్వం పేర్కొన్నారు. 'అమ్మ రూపొందించిన సమ్మిళిత వృద్ధి నమూనానే మేం కూడా అనుసరిస్తాం. అందరికీ అన్నీ దక్కేలా చూస్తాం' అని చెప్పారు.
మరోవైపు తమిళనాడు సీఎం పీఠం చిన్నమ్మ చేపట్టడం ఖాయమంటూ ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇండియా టుడే దక్షిణాది సదస్సులో భాగంగా న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన జయలలిత జీవితంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను శశికళ ప్రారంభించారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారి బహిరంగ కార్యక్రమంలో శశికళ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా శశికళ భావోద్వేగానికి గురయ్యారు. అయితే, ఇది జరిగిన కాసేపటికే ప్రసంగించిన పన్వీర్ సెల్వం చిన్నమ్మ ప్రస్తావన పెద్దగా లేకుండా మాట్లాడటం గమనార్హం. అమ్మ దారిలోనే ముఖ్యమంత్రిగా తాను ముందుకుసాగుతానని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సీఎం పదవి కోసం పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య పోటీ నెలకొన్నదనే కథనాలు కూడా వస్తున్నాయి.