
అల్లర్లకు బీజేపీ యత్నాలు
♦ నిరసనల తీరు ఇది కాదు
♦ సీఎం సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు:
బైక్ ర్యాలీ ద్వారా బీజేపీ నేతలు సమాజంలో శాంతి, సామరస్యాలను చెడగొట్టి అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. గురువారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘మంగళూరులో పాదయాత్ర నిర్వహిస్తామని బీజేపీ నేతలు ముందుగా చెప్పి ఉంటే అప్పుడే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి ఉండేవాళ్లం. అయితే వాళ్లు ప్రజాజీవనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అందువల్లే మేం అనుమతులు ఇవ్వలేదు. అంతేకాదు వారికి నిరసన తెలిపేందుకు, సమావేవం ఏర్పాటు చేసుకునేందుకు మేము ఎక్కడైతే అనుమతి ఇచ్చామో ఆ ప్రదేశాన్ని వదిలేసి, రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే ఎలాంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వబోము’ అని తెలిపారు.
గౌరీ కేసు సీబీఐకి ఇచ్చేందుకు సిద్ధం
ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించబోమని తామేనాడూ చెప్పలేదని అన్నారు. గౌరి లంకేష్ కుటుంబ సభ్యులు కోరితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తన పత్రికలో సంఘ్ పరివార్ గురించి హేళనగా కథనాలు రాయకపోయి ఉంటే ఈ రోజు గౌరి లంకేష్ చనిపోయి ఉండేవారు కాదు కదా? అన్న బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ వ్యాఖ్యల అర్థమేంటి? గౌరి లంకేష్ హత్య వెనక ఎవరి హస్తం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది కదా?’ అని సీఎం అన్నారు.