కోయంబత్తూరు పారాసెయిలర్ మృతి: షాకింగ్ వీడియో
కోయంబత్తూరు: సాహసక్రీడలో పాల్గొన్న వ్యక్తి అనూహ్యంగా మృత్యువాతపడిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సంచలనం రేపింది. పారాసెయిలింగ్ చేయబోయి.. ఆకాశం నుంచి అమాంతం పడిపోయిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు చిత్రీకరించారు. వివరాల్లోకి వెళితే..
కోయంబత్తూరు మెడికల్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన పారాస్లైడింగ్ ఈవెంట్ లో, అదే నగరానికి చెందిన వ్యాపారవేత్త మల్లేశ్వర రావు (53) పాల్గొన్నాడు. పారాచూట్ సాయంతో గాలిలోకి ఎగిరిన ఆయన.. క్షణాల్లోనే ప్రమాదానికి గురయ్యాడు. పారాచూట్ ను పట్టిఉంచే బెల్టును సరిగా పెట్టుకోకపోవడంతో మల్లేశ్వరరావు అటు పైకి ఎగరలేక, ఇటు కింది రాలేక సుమారు నాలుగు అంతస్థుల ఎత్తులో గాల్లోనే ఊగిసలాడాడు. ఇది గమనించిన నిర్వాహకులు అతన్ని కాపాడేందుకు పరుగెత్తేలోగా అమాంతం కిందపడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మెడికల్ కాలేజీ మైదానానికి చేరుకుని నిర్వాహకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు పరారయ్యారు. పారాసెయిలింగ్ ఈవెంట్ కు పోలీసుల అనుమతి లేదని, రక్షణ ఏర్పాట్లు లేకుండా ఎగరడం వల్లే మల్లేశ్వరరావు చనిపోయి ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈవెంట్ నిర్వహకులపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.