రాజకీయాల్లోకి రండి | Come to politics says IAS officer | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి రండి

Published Mon, Dec 21 2015 2:19 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

రాజకీయాల్లోకి రండి - Sakshi

రాజకీయాల్లోకి రండి

సహాయానికి యువత ఆహ్వానం
 చేతులు కలుపుదామని పిలుపు

 
 సాక్షి, చెన్నై : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటూ ఐఏఎస్ అధికారి సహాయం కు యువత ఆహ్వానం పలుకుతోంది. రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తూ, తమ సీఎం సహా యం అన్న నినాదంతో  ఇలక్కు(లక్ష్యం,టార్గెట్) పేరిట తిరుచ్చికి చెందిన సంస్థ చెన్నైలో ఆది వారం ర్యాలీ నిర్వహించింది. ‘సహాయం ఐఏఎస్’- పేరు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్మోగుతున్న విషయం తెలిసిందే. అవినీతికి వ్యతిరేకిగా, సంచనాల అధికారిగా ముద్ర పడ్డ సహాయం  ఉద్యోగ  పయనం  బదిలీల పర్వం తోనే సాగుతూ వస్తున్నది.  పుదుకోట్టైలో జన్మించిన ఆయన సివిల్ సర్వీసు ఉత్తీర్ణత సాధించినా, ఐఏఎస్ పదవిని ఎంపిక చేసుకోలేదు. తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా 1991లో దిండుగల్ జిల్లా ఒట్టన్ చత్రం సబ్ డివిజన్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు.
 
 అప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద సమరమే చేస్తూ వస్తున్నారు. తదుపరి కాంచీపురం జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరించి ఇసుక మాఫియా గుండెల్లో నిద్రించడమే కాకుండా, ఓ కోలా సంస్థకు వ్యతిరేకంగా వ్యవహరించి, ప్రజల దాహార్తిని తీర్చారని చెప్పవచ్చు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌గా సివిల్ సప్లయ్ విభాగంలో  రేషన్ మాఫియాకు దడ పుట్టించారు.  ఎక్కడ విధులు నిర్వర్థించినా అక్కడల్లా సంచలనమే. ఇందుకు ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన కానుక బదిలీ పర్వం. ఇప్పటి వరకు ఈయన 20 సార్లకు పైగా బదిలీల ఉత్తర్వుల్ని అందుకున్నారని చెప్పవచ్చు. నామక్కల్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యాక, మరో సంచలనం సృష్టిస్తూ ఐఎఎస్‌ల నెత్తిన గుది బండగా మారారు.
 
  తన ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించి ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి తాను వత్తాసు పలికేది లేదని చాటుకున్నారు. ఈ సమయంలో  సహాయంకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంచి గుర్తింపును ఇచ్చింది.  మదురై జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ అక్కడి అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఈ సమయంలో ఎన్నికల విధులతో పాటుగా, అక్కడి గ్రానైట్ మాఫియా కుంబకోణాల్ని తవ్విన సహాయం సంచలన ప్రకటన చేశారు. వేల కోట్ల మేరకు సాగిన ఈ స్కాం చివరకు కోర్టుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రానైట్ మాఫియా స్కాంలపై విచారించాలంటూ పదుల సంఖ్యల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎన్నికల అనంతరం ప్రాధాన్యత లేని శాఖలో పడి ఉన్న సహాయంకు హైకోర్టు అండగా నిలిచింది. మదురై కేంద్రంగా సాగిన గ్రానైట్ స్కాం విచారణ బాధ్యతల్ని ఆయనకే అప్పగించింది.
 
   ఎన్నో ఒడి దొడుగులు, బెదిరింపులు, హత్యా హెచ్చరికలు వచ్చినా ఏ మాత్రం తగ్గకుండా, సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించిన సహాయం, కీలక సలహాలు సూచనలు సైతం ఇచ్చారని చెప్పవచ్చు. ఎక్కడ కెళ్లినా వేదికల మీద అవినీతికి వ్యతిరేకంగా, ప్రజా హితం లక్ష్యంగా  ప్రసంగాలు చేసే సహాయం ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమ కారులకు, కొందరు యువతకు హీరోగా కన్పిస్తున్నట్టున్నారు.  అవినీతి ఊబిలో కూరుకు పోయిన ఏలిన వాళ్లను, ఏలుతున్న వాళ్లను  కడిగేద్దాం...చేతులు కలుపుదాం...మన సీఎం సహాయం అన్న నినాదాన్ని అందుకునే పనిలో పడ్డారు. ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించే నినాదాన్ని అందుకున్నారు.
 
 ఆహ్వానం : తిరుచ్చికి చెందిన ఇలక్కు( లక్ష్యం లేదా టార్గెట్) అనే సంస్థ సహాయం రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తూ సోషల్ మీడియా ద్వారా అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్లను, యువతను ఏకం చేసిందని చెప్పవచ్చు. తమ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా సహాయం ద్వారానే రాష్ట్రం సమగ్రాభివృద్ధి అన్న నినాదంతో ముందుకు సాగే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆదివారం చెన్నైలో భారీ ర్యాలీకి యత్నించారు. సుమారు వెయ్యి మంది వరకు తరలి వచ్చిన యువత, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లు చేతిలో ప్లకార్డులు బట్టి  ఆయనకు ఆహ్వానం పలికే యత్నం చేశారు.  ఎగ్మూర్  రాజరత్నం స్టేడియం ఆవరణలో ఏకమైన వీరందర్నీ  పోలీసులు అడ్డుకున్నారు.
 
  ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు చేయకూడదంటూ వారించారు. అయినా, తగ్గేది లేదన్నట్టుగా కాసేపు అక్కడే అటూ ఇటూ తిరుగుతూ నినాదాలతో హోరెత్తించారు. సహాయం రాజకీయాల్లోకి రావాలని, చేతులు కలుపుదాం..మన సీఎం సహాయం అన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయంగా ఇలక్కు నిర్వాహకుల్ని కదిలించగా, అవినీతికి వ్యతిరేకంగా, నిజాయితీకి మారు పేరుగా ఉన్న సహాయం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన  కేజ్రీ వాల్ ఏ విధంగా సీఎం  పగ్గాలు చేపట్టేందుకు పరిస్థితులు అనుకూలించాయో, అలాంటి పరిస్థితులే రాష్ట్రంలోనూ ఉన్నాయని పేర్కొన్నారు. సహాయం రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement