ఐఏఎస్‌లు నిష్పాక్షికంగా పనిచేయాలి
ఐఏఎస్‌లు నిష్పాక్షికంగా పనిచేయాలి
Published Tue, Sep 5 2017 2:30 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన
- పేదల అభ్యున్నతికి పనిచేయాలి
- పరిపాలనా నైపుణ్యాలు పెంచుకోవాలి
- అవినీతికి దూరంగా ఉంటూ కర్తవ్య పాలన చేయాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసు అధికారులు సమర్థంగా, నిష్పాక్షికంగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అవినీతికి తావులేకుండా స్వచ్ఛపాలనకు మార్గదర్శకులు కావాలని పిలుపునిచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం అఖిల భారత సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల 92వ ఫౌండేషన్ కోర్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు సేవలందించడంతో పాటు పరిపాలనా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సివిల్ సర్వెంట్లు పేదల అభ్యున్నతికి పనిచేసే లక్ష్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. పేదల సమస్యల పట్ల సహా నుభూతి, సామర్థ్యం, నిష్పాక్షికత కలిగి ఉండటంతో పాటు అవినీతికి దూరంగా ఉండటం వంటి ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని కర్తవ్య పాలన చేయాలని వివరించారు. అత్యంత పేద ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఉత్తమ పనితీరు కనబర్చాలి..
ఎల్లప్పుడూ మహాత్మాగాంధీ మాటలను దృష్టిలో ఉంచుకోవాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విధానాలను కార్యరూపంలోకి తీసుకురావాలంటే అధికారుల సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని, అధికారులు పాలనాపరమైన నైపుణ్యాలను అలవరచుకొని అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలన్నారు. ‘సంస్కరించు, ఉత్తమమైన పనితీరు కనబరుచు.. తద్వారా పరివర్తనకు కృషి చేయి’అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ప్రభుత్వ అధికారులకు ప్రేరణను ఇవ్వాలన్నారు. ప్రజలతో కలసి పని చేసేటప్పుడు వారి మాతృ భాషకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎలాంటి భయానికి, పక్షపాతానికి చోటివ్వకుండా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు.
సరికొత్త భారత్‌కు ప్రేరకులుగా..
మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి వారు బోధించిన ప్రకారం సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని చెప్పారు. అంత్యోదయ స్ఫూర్తిని అమలు చేయాలని అధికారులకు హితవు పలికారు. సరికొత్త భారత్‌కు ప్రేరకులుగా ఐఏఎస్ అధికారులు నిలవాలని పిలుపునిచ్చారు. హుందాతనంతో వ్యవహరించి ఓర్పుతో విని, సమ దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని, ఐఏఎస్‌లు అధికార దురహంకారాన్ని, దురుసుతనాన్ని దూరంగా ఉంచాలని సూచించారు. అవినీతి వ్యవస్థ శక్తివంతమైన దేశపు బలాన్ని హరిస్తుందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. చిత్తశుద్ధితో పాటు నైతిక ప్రవర్తనకు ‘న్యూ ఇండియా’లో పెద్దపీట వేయాలన్నారు. అలా చేస్తేనే అభివృద్ధి ఫలాలను అందరికీ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని వివరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement