ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్‌కర్ వివాదం యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపింది. పదవిలో ఉన్నప్పుడే కాకుండా, పదవీ అనంతరం కూడా ఎన్నో అత్యున్నత నియామకాలను సివిల్ సర్వీసెస్ వాళ్లు పొందుతున్నారు. అలాంటప్పుడు ఇందులోకి ఎలాగోలా ప్రవేశించడానికి న్యాయమో, అన్యాయమో ఒక కోటాను వాడుకోవడానికి అవకాశం ఉంది.
బుగ్గకారు, అధికారిక వసతి వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే స్వార్థపరులకు ఈ వ్యవస్థ తలుపులు తెరిచి ఉంచింది. అన్ని దశలలో క్లిష్టమైన మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే సివిల్ సర్వీస్ కోసం వైకల్యం కోటాలో మానసిక వైకల్యాన్ని అనుమతించడంలోని హేతుబద్ధతను సిబ్బంది–శిక్షణా సంస్థ(డీఓపీటీ) తప్పనిసరిగా వివరించాలి. వ్యవస్థను సంస్కరించడానికీ, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికీ నిర్మాణాత్మకమైన బహుముఖ విధానం అవసరం.
ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్‌కర్ చుట్టూ అలుముకున్న వివాదం ఏమిటంటే, ట్రెయినీ ఐఏఎస్‌గా పుణె కలెక్టరేట్‌లో నియమితురాలైన ఆమె బంగ్లా, కారు లాంటివి కావాలని అల్లరి చేయడమే! ఇది తెలిసి మన అత్యున్నత శిక్షణా విభాగం అంతా బాగానే ఉందా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. నేడు అందరి దృష్టీ ఖేడ్‌కర్ మీద ఉంది. కానీ ఈ ఉదంతంపై త్వరలోనే సిబ్బంది, శిక్షణా విభాగం(డీఓపీటీ) అదనపు కార్యదర్శి నివేదిక వెల్లడించిన తర్వాత, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) స్వయంగా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ఉదంతాన్ని ఖేడ్‌కర్‌తో ప్రారంభించాలంటే, రెండు వేర్వేరు పేర్లతో వైకల్య ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆమె మనస్సులో ఏముంది అనేది ఆలోచించాలి. ఆమె మొదటి సందర్భంలో ఏ విభాగపు వైకల్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు? కొన్ని మీడియా వార్తలు సూచించినట్లుగా ఆమె వాస్తవానికి మరొకదానికి మారారా లేక మరో వక్రమార్గాన్ని జోడించారా? ఆమె తండ్రి ప్రకటించిన వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల గరిష్ఠ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, నాన్–క్రీమీలేయర్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ధ్రువీకరణను ఎలా పొందగలిగారు? అక్కడి తహసీల్దార్ కూడా ఖేడ్‌కర్ తండ్రీ కూతుళ్ల కోరిక మేరకు ఈ సృజనా త్మక రచనలో తన సముచిత వాటాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
వైకల్యాలున్న వ్యక్తుల హక్కుల (ఆర్‌పీడబ్ల్యూడీ) చట్టం– 2016, దీర్ఘకాలిక ప్రాతిపదికన ఒక నిర్దిష్ట విభాగంలో కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లుగా, వైద్యాధికారి ధ్రువీకరించిన వ్యక్తినే ‘బెంచ్‌మార్క్ వైకల్యం’ ఉన్న వ్యక్తిగా నిర్వచించింది. ‘మానసిక వికలాంగుల’ విభాగంలో ఉపాధి కోసం ఆమోదించబడిన వైకల్యపు కనీస శాతం 35. ఖేడ్‌కర్ ఉదంతంలో చాలామంది ఆమె 35 శాతం మానసిక వైకల్యం సమీపంలో కూడా లేదనీ, తన కేసును ముందుకు తీసుకు రావడానికి ఆమె ఉదహరించిన రెండు వైకల్యాల్లో ఇది ఒకటనీ హామీపూర్వకంగా చెబుతున్నారు.
పూజా ఖేడ్‌కర్ కేసు సముద్రంలో నీటిబొట్టంతే కావచ్చు. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ నిస్సందేహంగా, కొన్ని వందల ఉద్యోగాల కోసం లక్షకుపైబడిన వార్షిక దరఖాస్తుదారులతో తీవ్రాతితీవ్రమైన పోటీతో కూడి ఉంటుంది. అభ్యర్థులు వాస్తవానికి, డబ్బు, సమయం పరంగా భారీగా పెట్టుబడి పెడతారు. సగటున, వారు తమ అమూల్య మైన కాలంలో రెండు–మూడు సంవత్సరాలు కేవలం సన్నాహకాల్లోనే గడుపుతారు.
ఉత్తమంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, దానిని సాధించే విషయంలో అత్యంత చురుకైన వారికి కూడా ఎలాంటి హామీ ఉండదు. అటువంటి అత్యున్నత ప్రయోజనాలతో కూడిన వ్యవస్థలో న్యాయమో, అన్యాయమో వైకల్యం సహా వివిధ కోటాలను పోస్టుకు హామీగా ఉపయోగించుకోవడానికి చాలామంది ఆకర్షితులు కావచ్చు. విచారణ పరిధిని విస్తరించడానికి అన్ని వైకల్య కేసులను ఈ దృక్కోణం నుండి చూడటం సిబ్బంది–శిక్షణా సంస్థ(డీఓపీటీ)కి మంచిది.
సివిల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించడానికి అభ్యర్థులు ఎంత దూరమైనా వెళతారు అనేందుకు తగు కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది సర్వీసులో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా ప్రతిష్ఠాత్మకమైన, సవాలుతో కూడిన కెరీర్ ఎంపికలను వాగ్దానం చేస్తుంది. చాలామంది మాజీ సివిల్ సర్వెంట్లను ప్రభుత్వం ట్రిబ్యునళ్లు, కమిషన్లు, రెగ్యులేటరీ అథారిటీలు, గవర్నర్ పదవులకు కూడా నియస్తుంటుంది. పలువురు వ్యక్తులు ప్రైవేట్ రంగంలో కూడా అత్యున్నత నియామకాలను అందుకుంటారు. అతి పెద్ద కన్సల్టింగ్ సంస్థలు ఇప్పుడు నయా ట్రెండ్! ప్రభుత్వం లోపల తమ నెట్‌వర్క్ లను ప్రభావితం చేయాలనే ఆశ వీరికుంటుంది.
సర్వీసులో ఉండగానే వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. ఇరవైల మధ్య నుండి చివరి వరకు మాత్రమే వయస్సు గల ఒక వ్యక్తి తరచుగా చిన్న ఐరోపా దేశాల పరిమాణంలో ఉన్న జిల్లాకు ప్రపంచంలో మరెక్కడైనా నాయకత్వం వహించగలరా?
అన్ని దశలలో క్లిష్టమైన మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే సివిల్ సర్వీస్ కోసం వైకల్యం కోటాలో మానసిక వైకల్యాన్ని అనుమ తించడంలోని హేతుబద్ధతను సిబ్బంది, శిక్షణా సంస్థ(డీఓపీటీ) తప్పనిసరిగా వివరించాలి. కీలకమైన మరొక ప్రశ్న ఏమిటంటే యూపీఎస్సీ పరీక్ష సమర్థత గురించి! పునరావృత అభ్యసన, అరగంట ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇవ్వడమే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఉత్తమమైన మార్గమా? సమగ్రత, సహానుభూతి, సాను కూల నాయకత్వం, సమస్య పరిష్కారం వంటి లక్షణాలను అస్సలు అంచనా వేయలేము.
డిఫెన్స్ సర్వీసెస్ విషయంలో లాగా కాకుండా, ఇక్కడ యోగ్యతా పరీక్ష లేదు. తత్ఫలితంగా, మన సివిల్ సర్వీసులను నిర్వహించే విషయంలో ప్రస్తుత సందర్భంలో లాగా, మనకు తక్కువ భావోద్వేగాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. బుగ్గకారు, అధికారిక వసతి వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే స్వార్థపరులకు ఈ వ్యవస్థ తలుపులు తెరిచి ఉంచింది.
దరఖాస్తుదారులకు ప్రయోజనాలను తగ్గించడానికీ, తద్వారా మోసం, రిగ్గింగ్ అవకాశాలను తగ్గించడానికీ ఒక మార్గం ఏమిటంటే ఎంపిక ప్రక్రియ వ్యవధిని తగ్గించడం. బహుశా సాంకేతికతను ఉపయోగించడం. ప్రతి దశలో మూల్యాంకన ప్రమాణాలు, మార్కింగ్ ప్రమాణాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేయడం ద్వారా పారదర్శకతను పెంచడం అవసరం. తద్వారా సవాళ్లు అధిగమించబడతాయి, పరిష్కరించబడతాయి. వాస్తవానికి, అడ్మినిస్ట్రేటివ్ స్థానాల్లోకి అధిక అర్హత కలిగిన నిపుణులు, డొమైన్ నిపుణుల ప్రవేశం కేవలం పేరును బట్టి ఉండకూడదు. బలమైన పార్శ్వ ప్రవేశ ప్రక్రియ సివిల్ సర్వీసును దాని యధాస్థానంపై నిలిపి ఉంచుతుంది.
యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత దేశ సివిల్ సర్వెంట్లు వారి ఉద్యోగాల కోసం శిక్షణ పొందే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ భారీ పాత్రను పోషించాలి.రెండు సంవత్సరాల శిక్షణ ఒక అధికారి భవిష్యత్తుకు, ఆమె/అతను పరిస్థితులతో వ్యవహరించే విధానానికి పునాది వేస్తుంది. పేద గిరిజన రైతు జక్తు గోండ్‌పై కార్యకర్త హర్‡్ష మందర్ చేసిన కేస్ స్టడీలు నేటికీ చాలామంది మనస్సులలో నిలిచిపోయాయి. పేదరికానికి సంబంధించిన సమస్యలతో వ్యవహరించడంలో ఇవి ఒక తరం అధికారులను ప్రభావితం చేస్తూ వచ్చాయి.
విచ్ఛిన్నమైన వ్యవస్థలతో పోరాడటం కంటే మనం వాటిని సరిదిద్దాలి. ఒక ప్రక్రియపై, దాని న్యాయబద్ధతపై మనకు విశ్వాసం ఉంటే, మనం ఫలితాలను ఆమోదించగలము. ఏదైనా వ్యవస్థను సంస్కరించడానికీ, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికీ నిర్మాణాత్మకమైన బహుముఖ విధానం అవసరం. రోజులు గడు స్తున్నకొద్దీ, ఎంపిక ప్రక్రియను మోసగించిన అధికారుల ప్రవేశానికీ, ఇటీవలి నీట్ వైఫల్యానికి దారితీసిన లోపాలకూ మధ్య వింతైన సారూప్యత నొక్కి చెప్పబడుతోంది.
ఫలితంగా ఈ దేశవ్యాప్త పరీక్షలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటివి జరగకుండా చేయలేని మన లాంటి విశాల దేశానికి ఇది దురదృష్టకరం. వ్యవస్థను సరిగ్గా అమర్చడంలో, దానిపై విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో డీఓపీటీ, యూపీఎస్సీ సరిగ్గా వ్యవహరిస్తాయని ఆశిద్దాము.
– అశోక్ ఠాకూర్ ‘ కేంద్ర మాజీ విద్యా కార్యదర్శి
– ఎస్.ఎస్. మంథా ‘ ‘ఏఐసీటీఈ’ మాజీ చైర్మన్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
యూపీఎస్సీపై మరక తొలగేదెలా?
Published Thu, Jul 25 2024 12:22 AM | Last Updated on Thu, Jul 25 2024 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment