
అదనపు ఆదాయంపై ‘బెస్ట్’ దృష్టి
నగరవాసులపై ‘ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్’ భారం మోపే యోచన
సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ఆదాయం పెంపు వేటలో పడింది. ఇందులోభాగంగా ముంబైకర్లపై ‘ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్’ భారం మోపాలని యోచిస్తోంది. దీన్ని అమలు చేసేందుకు కార్పొరేషన్ చట్టంలో మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను ఆ సంస్థ పరిపాలనా విభాగం సిద్ధం చేసింది. ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్ వసూలు విధానాన్ని అమలు చేస్తే బెస్ట్ సంస్థకు అదనపు ఆదాయం వస్తుంది. అదే జరిగితే ముంబైకర్ల జేబులకు చిల్లులు పడడం మాత్రం ఖాయం.
నగరంలో సేవలందిస్తున్న బెస్ట్ సంస్థకు అనేక రూట్లలో కనీస ఆదాయం కూడా రావడం లేదు. దీంతో ప్రతి ఏడాదీ నష్టాలవుతోంది. చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ కారణంగా బెస్ట్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటికే ఈ సంస్థ రూ.మూడున్నర వేల కోట్ల మేర నష్టాల్లో నడుస్తోంది. పైగా అప్పులు కూడా ఉన్నాయి. ఇలా సంస్థపై మొత్తం రూ. ఏడు వేల కోట్ల వరకూ భారం ఉంది. గతంలో విద్యుత్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రవాణా విభాగానికి మళ్లిస్తూ కాలం గడుపుతోంది. అయితే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ విధించిన ఆంక్షల కారణంగా దానికీ గండిపడింది.
దీనిపై కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోర్టు సూచించింది. దీంతో తమకు రూ.160 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేయాలంటూ బీఎంసీకి బెస్ట్ సంస్థ విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి కనీస చార్జీల్లో రెండు రూపాయలు, ఒకవేళ సహాయం అందిస్తే రూపాయి పెంచుతామని స్పష్టం చేసింది. దీనిపై కూడా ఎటువంటి స్పష్టత రాకపోవడంతో చేసేది లేక ప్రయాణికులపై ట్రాన్స్‌పోర్టు ట్యాక్సు విధించాలని యోచిస్తోంది.