వివాదాల్లో నటి కాజల్ అగర్వాల్ | Complain against Kajal for not returning advance | Sakshi
Sakshi News home page

వివాదాల్లో నటి కాజల్ అగర్వాల్

Published Thu, Sep 25 2014 12:26 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

వివాదాల్లో నటి కాజల్ అగర్వాల్ - Sakshi

వివాదాల్లో నటి కాజల్ అగర్వాల్

వివాదాల్లో హీరోయిన్లు అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. మొదట నటించడానికి సమ్మతించడం ఆ తరువాత కాల్‌షీట్స్ లేవంటూ నిర్మాతల్ని సమస్యల్లోకి నెట్టడంలాంటి చర్యల్లో నాయికలు చర్చనీయాంశంగా మారుతున్నారు. వీళ్ల వెర్షన్ మరోలా ఉంటుంది. తామిచ్చిన కాల్‌షీట్స్ సద్వినియోగ పరుచుకోకుండా ఇతర చిత్రాల్లో నటించనీయకుండా కొందరు నిర్మాతలు తమను నష్టపరుస్తున్నారన్నది నాయికల వాదన. ప్రస్తుతం ఇలాంటి వివాదాల్లోనే నటి కాజల్ అగర్వాల్, కన్నడ నటి హరిప్రియ చిక్కుకున్నారు. వీరిద్దరిపై నిర్మాతల మండలికి ఫిర్యాదులు చేరాయి. వివరాల్లోకెళితే నటి కాజల్ అగర్వాల్ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బేండా చిత్రంలో నటించడానికి అంగీకరించారు.
 
 అందుకు పారితోషికం కోటిన్నరగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అదేవిధంగా అడ్వాన్స్‌గా 40 లక్షలు పుచ్చుకున్నారు. ఆ తరువాత కొన్ని సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద నన్బేండా చిత్రంలో కాజల్ నటించలేదు. ఆమెకు బదులు నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో తానిచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్ కాజల్ అగర్వాల్‌ను అడిగారు. అందుకామె అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదు పొమ్మంది. అందుకామె చెబుతున్న రీజన్ తాను కేటాయించిన కాల్‌షీట్స్‌ను సద్వినియోగం చేసుకోకుండా చివరి క్షణంలో షూటింగ్ షెడ్యూల్ మార్చుకోవడం వల్ల తన కాల్‌షీట్స్ వృథా అయ్యాయని, తద్వారా తెలుగులో ఒక ప్రముఖ నటుడితో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చిందన్నది.
 
 దీంతో ఉదయనిధి స్టాలిన్ కాజల్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మండలిలో చర్చ జరుగుతుండగా కాజల్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదని కాజల్ వర్గం తేల్చి చెప్పేసినట్లు సమాచారం. అదేవిధంగా తమిళంలో మురన్, వల్లకోట్టై తదితర చిత్రాల్లో నటించిన కన్నడ నటి హరిప్రియ ఒక కన్నడ చిత్రంలో నటించడానికి రెండు కోట్లు తీసుకుందట. అయితే ఆ చిత్రంలో ఆమెకు బదులు వేరే నటిని ఎంపిక చేసినట్లు తెలిసింది. దీంతో ఆ నిర్మాత నుంచి తీసుకున్న రెండు కోట్లు తిరిగి ఇవ్వడానికి నటి హరిప్రియ నిరాకరించారట. ఇప్పుడా నిర్మాత కన్నడ నిర్మాతల మండలిలో హరిప్రియపై ఫిర్యాదు చేశారు.
 
 అయితే ఈమె కూడా తీసుకున్న రెండు కోట్లు తిరిగిచ్చేది లేదంటూ ఖరాఖండిగా చెప్పేసినట్లు సమాచారం. చిత్రంలో ఒక్క రోజు నటించి ఆ తరువాత నటించకపోతే తీసుకున్న మొత్తం తిరిగి నిర్మాతకు చెల్లించాలనే నిబంధన సంఘంలో ఉందట. కానీ ఈ ఇద్దరు భామలు ఒక రోజు కూడా నటించకుండా ఆ చిత్రాల్లో నటించలేదు. కాబట్టి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సిందే లేని పక్షంలో తగిన చర్యలుంటాయని సీనియర్ నిర్మాత ఒకరు అన్నారు. కాబట్టి నటి కాజల్ అగర్వాల్, హరిప్రియల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement