అది లంచం కింద ఇచ్చిన వాచ్
► ఏసీబీలో సీఎంపై ఫిర్యాదు
బెంగళూరు: ముగిసిపోయిందనుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అవినీతి పరులైన అధికారులను రక్షించినందుకు గాను లంచంగా ఆ వాచ్ సీఎం చేతికి వచ్చి చేరిందంటూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహాం ఏసీబీలో సీఎం సిద్ధరామయ్య పై ఫిర్యాదు చేశారు.
పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.రఘు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు ఎల్.లక్ష్మణ్‌కు సీఎంకు ఆ వాచ్‌ను అందజేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్.రఘు, ఎల్.లక్ష్మణ్‌లపై లోకాయుక్తలో కేసులు ఉన్నాయని ఈ కేసులకు సంబంధించి విచారణ ముందుకు సాగకుండా ఉండేందుకు లంచంగా ఆ వాచ్‌ను సీఎం సిద్ధరామయ్యకు అందజేశారని ఆరోపించారు. వీరిద్దరూ సీఎం వర్గానికి చెందిన వారు కావడంతో స్వజాతి ప్రేమతో ఇదంతా చేశారని, అందువల్ల తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు.