- హోటళ్లు, రెస్టారెంట్లకు రాత్రి 1 వరకు అనుమతి
- బార్లు, పబ్‌లకు వారాంతాల్లో మాత్రమే
- అనుమతించిన సర్కార్
- మూడు నెలల పాటు ప్రయోగాత్మంగా అమలు
- శాంతి భద్రతల సమస్య తలెత్తితే పునరాలోచన
- అక్రమ మైనింగ్‌పై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు
- హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాత్రి జీవనం (నైట్ లైఫ్) గురించి కలలు కంటున్న టెక్కీల కోరికలు ఎట్టకేలకు ఫలించనున్నాయి. రాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లను తెరచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతించింది. బార్లు, పబ్‌లు వారాంతాల్లో మాత్రమే ఒంటి గంట వరకు తెరచి ఉంచాలి. కొన్ని సంఘాలు, సంస్థల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ వెల్లడించారు.
ఈ రోజు (శనివారం) నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. ఇతర మెట్రో నగరాల్లో కూడా ఒంటి గంట వరకు నైట్ లైఫ్‌ను విస్తరించారని తెలిపారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే దీనిపై పునరాలోచిస్తామని వెల్లడించారు.
నగర పోలీసు కమిషనర్ సహా సీనియర్ పోలీసు అధికారులు నైట్ లైఫ్‌ను విస్తరించడాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దీనిపై సాధక బాధలను చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడానికి ఇప్పుడున్న పోలీసులు సరిపోరనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు వేల మంది హోం గార్డులను నియమించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జరగబోయే నేరాలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదని, అయితే నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు.
ప్రత్యేక బృందాలు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు జరపడానికి రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక బృందాలను నియమిస్తామని ఆయన తెలిపారు. లోకాయుక్త ప్రతిపాదనల మేరకు వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా శాంతి భద్రతలను కాపాడే దిశగా అదనపు డీజీపీ స్థాయి అధికారులను జిల్లాల ఇన్‌ఛార్జిలుగా నియమించనున్నట్లు వెల్లడించారు. నిర్జన ప్రదేశాల్లో ఏటీఎంలకు సాయుధ సిబ్బందిని కాపలాగా నియమించాలని ఆయా బ్యాంకులకు సూచించామని ఆయన తెలిపారు.