► జయకు సంతాపం
►అసెంబ్లీలో నివాళి
► హృదయ ‘దేవత’ : పన్నీరు
► ధైర్యానికి ప్రతిరూపం : స్టాలిన్
సాక్షి, చెన్నై : తమిళుల అమ్మ జయలలితకు మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ నివాళులర్పించింది. సంతాప తీర్మానంతో సభ్యులందరూ మౌన అంజలి ఘటించారు. అమ్మ భౌతికంగా దూరమైనా తమ అందరి హృదయంలో ఆ దేవత చిరస్మరణీయం అని ఉద్వేగ భరిత ప్రసంగంతో ఈ సందర్భంగా సీఎం పన్నీరుసెల్వం స్పందించారు. ధైర్యానికి ప్రతి రూపం అమ్మ అని ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజు మంగళవారం సంతాప తీర్మానాలతో సరిపెట్టారు. పది గంటలకు సభ ప్రారంభం కాగానే, స్పీకర్ ధనపాల్ సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు.
మాజీ గవర్నర్ సూర్జిత్‌సింగ్ బర్నాలా, తుగ్లక్ సంపాదకుడు నటుడు చోరామస్వామి, కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రో, మాజీ మంత్రి కేసీ మణిలతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం ప్రకటించారు. దీంతో సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అమ్మ జయలలిత మృతికి సంతాపం తెలుపుతూ సీఎం పన్నీరుసెల్వం తీర్మానం తీసుకొచ్చారు. అమ్మ ఖ్యాతిని ఎలుగెత్తి చాటుతూ ప్రజాహిత పాలనను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని సాగించారు. అమ్మ పథకాల గురించి వివరిస్తూ, ప్రజాస్వామ పరిరక్షణ, తమిళుల హక్కుల రక్షణ లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకులు తమ అమ్మ అని కొనియాడారు.
అమ్మ భౌతికంగా దూరమైనా, ఆ దేవత తమ హృదయాల్లో చిరస్మరణీయం అని వ్యాఖ్యానించారు. కొన్ని వ్యాఖ్యల్ని సంధించే క్రమంలో పన్నీరు కాస్త ఉద్వేగానికి లోనైనట్టు కన్పించినా, ప్రసంగ పాఠాన్ని ముగించారు. ఇక, రెండు నిమిషాల పాటు అమ్మకు మౌన అంజలి ఘటించినానంతరం సభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రసంగించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తన పట్ల అధికారులు వ్యవహరించిన తీరును పరిగణించి జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారని గుర్తుచేశారు. తనను గానీ, డీఎంకేనుగానీ అవమాన పరచాలన్న ఉద్దేశం తనకు లేదు అని, కలసికట్టుగా ప్రజాహితాన్ని కాంక్షిస్తూ పయనం సాగిద్దామని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఎంతో ఆనందాన్ని కల్గించాయన్నారు.
అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమాచారంతో తమ అధినేత కరుణానిధి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని, స్వయంగా తనను వెళ్లి పరామర్శించి రావాలని సూచించినట్టు గుర్తు చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తారని భావించానని, అయితే, హఠాత్తుగా అందర్నీ వీడి అనంత లోకాలకు వెళ్లడం తీవ్ర వేదనకు గురిచేసినట్టు పేర్కొన్నారు. జయలలిత ఎన్నో సేవలు చేశారంటూ, తమ వరకు ధైర్యానికి ప్రతీరూపంగా ఆమె కనిపించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి తన ప్రసంగంలో జయలలితకు సాటి మరొకరు లేరని వ్యాఖ్యానించారు.
ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ సభ్యుడు అబూబక్కర్, కొంగు ఇలంజరై పేరవై తనియరసు, ఎమ్మెల్యేలు కరుణాస్, తమీమున్ అన్సారీ ప్రసంగించారు. అమ్మకు సంతాపం తదుపరి సభను బుధవారానికి వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ అంశాలపై చర్చ సాగనున్న దృష్ట్యా సభలో వాతావరణం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి.