'టీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి'
గద్వాల: త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలను ప్రదర్శిస్తోందని, ఈ కుటిల రాజకీయాలను అడ్డుకోవాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించి తగిన బుద్ది చెప్పాలన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
గతంలో ఏ ప్రభుత్వం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయాలు చేయలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతూ నీతిమాలిన రాజకీయాలకు దిగుతుందని ఆరోపించారు. సాధారణ ఎన్నికల మాదిరిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటూ ఈ ఎన్నికలకు రాజకీయ రంగు పులుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు టీఆర్‌ఎస్ కండువాలు కప్పుతూ పార్టీలోకి ఆవాహ్వనించడంతో పాటు స్వయంగా ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గోనడం విడ్డురంగా ఉందని విమర్శించారు.
తమ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని, ఓటేయకపోతే ఇబ్బందులు తప్పవనే ధోరణికి పాల్పడుతూ ఉపాధ్యాయులను భయందోళనకు గురిచేస్తున్నారని ఆమె విమర్శించారు. మేధావి వర్గం అయిన ఉపాధ్యాయులకు తమ నాయకుడిని ఎన్నుకునే సత్తా ఉందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఎన్నుకునే భాద్యతను ఉపాధ్యాయులకే వదిలివేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్‌సీ బకాయిలు, డీఎస్సీ నోటిఫీకేషన్, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, నియమకాలు వంటి హమీలను అమలు చేయకుండా నాన్చుడు దోరణిని అవలంభిస్తున్న ప్రభుత్వ తీరును ఎక్కడిక్కడ ఎండగట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
దక్షిణ తెలంగాణపై సీఎం దృష్టి సారించాలి
అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ సమన్యాయం చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్ నియోజకవర్గానికే పరిమితం అవుతూ ఇతర ప్రాంతాలకు మొండి చెయ్యి చూపుతున్నారని డీకే అరుణ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా అభివృద్ది బాటలో నడిపించి ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలన్నారు. గజ్వేల్‌తో పాటు గద్వాల్‌ను కూడా ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని కోరారు. సీఎం ఉత్తర తెలంగాణనే కాదు అన్నింట్లో వెనకబడిన దక్షిన తెలంగాణపై దృష్టిసారించి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ది చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, మహబూబ్‌నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ కట్ట రవికిషన్‌రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మణ్‌యాదవ్, ఖాజాపాష, గంజి ఆంజనేయులు, షబ్బిర్, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.