ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్‌పై ఆ పార్టీ వేటు వేసింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్‌పై ఆ పార్టీ వేటు వేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా బర్ఖా సింగ్ నిన్న (గురువారం) ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అయితే తాను పదవికి రాజీనామా చేసినా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని బర్ఖా సింగ్ పేర్కొన్న విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదని, స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వీలున్న పార్టీ అని తాను పార్టీ వదలనని ఆమె చెప్పారు. కాగా రాహుల్ గాంధీకి పార్టీ నడపడం చేతకాదని, ఆయన పార్టీ అధ్యక్షపదవికి పనికిరారని విమర్శలు చేయడంతో క్రమశిక్షణా రాహిత్యం కింద బర్ఖా సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మరోవైపు బర్ఖా సింగ్ వ్యక్తిగత కక్షతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ, పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.