మన సంస్కృతికి విరుద్ధం
కిస్ ఆఫ్ లవ్’పై రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ
బెంగళూరు : మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా నగరంలో కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలు నిర్వహించ తలపెట్టిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ వెల్లడించారు. గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకించేందుకు ‘కిస్ ఆఫ్ లవ్’ తరహా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రేమ, అభిమానం అనేవి సంస్కారం అనే పరిధిని దాటకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
సంస్కారమనే హద్దులు దాటే ఎలాంటి కార్యక్రమానికైనా భారతీయ సంస్కృతిలో స్థానం లేదని, అందువల్ల ఇలాంటి కార్యక్రమాలను తాను సమర్థించబోనని పేర్కొన్నారు. ఇక పరప్పన అగ్రహార జైలులోని మహిళా ఖైదీలపై అక్కడి వార్డర్లు లైంగిక హింసకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ... ‘నేను ఈ విషయంపై పరప్పన అగ్రహార జైలులోని ఖైదీలను కలిసి మాట్లాడాను. వారు నాతో ఏ విషయాలైతే చెప్పారో అవే మీడియాకు సైతం వివరించాను. ఇందులో నేను సొంతంగా కల్పించినవి ఏమీ లేవు’ అని స్పష్టం చేశారు.