నా చావుకు మంత్రే కారణం..
మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీపై ఆరోపణలు
బెంగళూరు: ‘నా కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా ఎంతగానో బతిమాలాను. అయినా పోలీసులు నన్ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కె.జె.జార్జ్తో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ దృష్టికి తీసుకొచ్చినా వారు కూడా న్యాయం చేయలేదు. నా చావుకు వీరే కారణం’ అంటూ తన మరణానికి ముందు వీడియో రికార్డ్ చేశాడు రామనగర జిల్లా మాగడి తాలూకా గవినాగమంగళ గ్రామానికి చెందిన రైతు శివణ్ణ(65). వివరాలు.. శివణ్ణ కుటుంబానికి అదే గ్రామంలోని బంధువుల కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇటీవల శివణ్ణ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. అంతేకాదు శివణ్ణ భార్యను నడిరోడ్డు పై వివస్త్రను చేసి అవమానించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మంత్రుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా అక్కడ కూడా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఇక తన సమస్యకు పరిష్కారం లభించదని భావించిన శివణ్ణ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.
కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆదివారం తెల్లవారుఝామున శివణ్ణ మృతిచెందారు. మృతిచెందడానికి కాసేపటి ముందు శివణ్ణ ఇచ్చిన స్టేట్మెంట్ను ఆయన కుటుంబ సభ్యులు వీడియో రికార్డ్ చేశారు. ‘నా మరణానికి మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీలు కారణం, అంతేకాదు డీవైఎస్పీ లక్ష్మీగణేష్, స్థానిక పోలీసులు కూడా నా చావుకు కారణం.’ అని వీడియోలో రికార్డ్ చేశారు. ఇదే సందర్భంలో డీజీపీ ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ పేరును కూడా శివణ్ణ పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.