నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు
Published Sat, Sep 14 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
చెన్నై టీ.నగర్‌లోని రంగనాథన్ తెరులో 26 దుకాణాల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన గడువు పూర్తయినా ఆ దుకాణాలకు ఎందుకు సీల్ వేయలేదంటూ అధికారులపై మండిపడింది. చెన్నై కార్పొరేషన్, విద్యుత్, నీటి సర ఫరా విభాగాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై టీనగర్‌లోని రంగనాథన్ తెరు (రంగనాథన్ వీధి) ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పేరు పొందిన వస్త్ర, గృహోపకరణ దుకాణాలు ఉన్నాయి. నగరానికి షాపింగ్‌కు వచ్చేవారిలో 50 శాతానికిపైగా ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. పండుగరోజుల్లో కాలు మోపేందుకూ స్థలం ఉండదు. దీపావళి, సంక్రాంతి వంటి పండుగల్లో ప్రజలు ఊపిరాడక ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రంగనాథన్ తెరులో అనేక దుకాణాలు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు సాగించడమే ఈ ఇబ్బందులన్నింటికీ కారణం. దీనిపై వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలకు అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 26 దుకాణాలకు చెన్నై కార్పొరేషన్ రెండు సంవత్సరాల క్రితం సీల్ వేసింది. అక్కడి వ్యాపారులు తొలుత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత సుప్రీంకోర్టు ద్వారా పోరాడుతున్నారు.
ఆరు వారాల అనుమతి
పొంగల్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకున్న సుప్రీంకోర్టు 2012 జనవరి 9వ తేదీ నుంచి ఆరువారాలు 26 దుకాణాల్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించాల్సిందిగా కార్పొరేషన్‌కు సూచించింది. ఈ మేరకు దుకాణాలు తెరుచుకున్నాయి. ఆరువారాల గడువు పూర్తయినా మరలా వాటికి సీల్ వేసే ప్రయత్నం కార్పొరేషన్ అధికారులు చేయలేదు. మరోవైపు 26 దుకాణాల్లో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఈ వ్యవహారంపై ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అధికారుల తీరును ఎండగట్టా రు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. దుకాణాల్లో యథేచ్ఛగా వ్యాపారం సాగుతుండడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన గడువు పూర్తికాగానే ఆ 26 దుకాణాలకు ఎందుకు సీల్ వేయలేదంటూ చెన్నై కార్పొరేషన్, విద్యుత్, నీటి సరఫరా విభాగాలకు నోటీసులు జారీ చేసింది.
Advertisement
Advertisement