త్వరలో అమిత్‌షాకు ఢిల్లీ బాధ్యతలు
న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నష్టం కలిగించే పరిణామాలను నుంచి పార్టీని గట్టెక్కించేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం కృషి చేస్తోంది. ఢిల్లీ శాఖలో అంతర్గత కలహాలు, రాష్ట్ర నాయకుల్లో కొరవడిన సమన్వయం కారణంగా వచ్చే నష్టాన్ని నివారించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను అప్పగించనుంది. ఈ నెల 25 ఆయన ప్రత్యక్షంగా ఢిల్లీ ప్రచార రంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే షా జార్ఖాండ్, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నారు. అక్కడ ఎన్నికల క్రతువు దాదాపు పూర్తి అయ్యింది.
కొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2015 లో జరగవచ్చు. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందుగానే షాను ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించేలా అధిష్టానం చర్యలు తీసుకొంటుంది. ‘ ఎందుకంటే ప్రస్తుతం నాయకత్వం ఎవరికివారే కెప్టెన్‌లాగా వ్యవహరిస్తూ ఓటర్లను గందరగోళం చేస్తున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే సూచనలున్నాయి. దీన్ని అధిగమించేందుకు షాను రంగంలోకి దింపుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాయకులకు సలహాలు, మార్గనిర్ధేశనం చేయగలిగిన వ్యక్తి అవసరం ఆ పార్టీకి ఉంది. కానీ నాయకత్వం లోపం ఉంది. ఈ క్రమంలో దాన్ని భర్తీ చేయడానికి అమిత్‌షాను రంగంలోకి దింపుతుందని పార్టీ సీనియర్ నాయకులు వెల్లడించారు.
ఆప్‌ను ఎదుర్కొనేందుకే..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీని అడ్డుకోవడానికి, అవసరమైన రాజకీయ ఎత్తుగడలు వేయగల సమర్ధుడైన వ్యక్తి షా అని పార్టీ భావిస్తోంది. 15 ఏళ్లు ఢిల్లీ అధికార పీఠానికి దూరమైన బీజేపీకి అధికార పగ్గాలు దక్కాలంటే అమిత్ షా నాయకత్వంలోనే ముందుకు సాగడం మేలని కేంద్ర నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోందని తెలిసింది. దేశవ్యాప్తం కాంగ్రెస్ వ్యతిరేక పవనాల వల్ల బీజేపీకి ఎదురులేకుండా పోయింది. కానీ, ఢిల్లీలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ఆప్ గతంలో అధికారం చేజిక్కొంది. మరోసారి అధికారం కోసం పట్టుబిగిస్తోంది. ఆప్‌తో తలపడడానికి షా బీజేపీకి పెద్దదిక్కు అని,ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి పార్టీ సన్నాహాలు చేస్తోంది.