
బాహుబలి2 విడుదలకు సహకరించాలి..
చెన్నై: కావేరి వివాదంలో తమిళ నటుడు సత్యరాజ్ క్షమాపణలు చెప్పాడు. అంతేకాక బాహుబలి-2ను అడ్డుకోకూడదని కన్నడిగులకు దర్శకుడు రాజమౌళి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ.. 9 సంవత్సరాల ముందు మాట్లాడిన మాటలకు నిరసనగా బాహుబలి-2ను కన్నడిగులు ప్రదర్శన చేయకుండా అడ్డుకుంటామన్నడం కన్నడ, తెలుగు ప్రజల మధ్య విఘాతానికి కారణం కాకూడదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చిత్రా ప్రదర్శన జరిపించాలని కోరారు.
కళకు, రాజకీయ మాటలకు సంబంధం లేదని అన్నారు. భారతదేశ చలనచిత్ర వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం బాహుబలి అని పోగిడారు. అలాంటి సినిమాను అడ్డుకోకుండా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు. కన్నడ నాట పుట్టి పెరిగినా రాజమౌళిని కన్నడిగులు తమ సహోదరులుగా భావించి చిత్ర విడుదలకు సహకరించాలని పేర్కొన్నారు. అంతేకాక కన్నడ, తెలుగు ప్రజల మధ్య కొనసాగుతున్న సోదర భావం కొనసాగటానికి స్వాగతించాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు.