రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి
బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా...
ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో పర్యటించండి
సీఎల్పీ సమావేశంలో సీఎం సిద్ధు
బెంగళూరు : రాష్ట్రంలో రైతుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో బాధిత రైతుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పడంతో పాటు రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని రైతులను కలిసి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని బుధవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించి, ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. విధానసౌధలోని సమ్మేళన సభాంగణలో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో రైతుల ఆత్మహత్యలపైనే ముఖ్యంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుల కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పాలని, ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టాలని ఆదేశించారు.
‘ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో పర్యటించండి. రైతులతో పాటు ఇతర సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో స్వయంగా తెలుసుకోండి, వారితో చర్చించి సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించండి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలేమిటో వారికి వివరించి చెప్పండి. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ విజ్ఞప్తి చేయండి’ అని సూచిం చారు. ఇక ఇదే సందర్భంలో ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు సైతం జిల్లాల్లో పర్యటించాలని, ఎమ్మెల్యేల డిమాండ్‌లపై వేగవంతంగా స్పందించాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతున్న తీరుపై సమావేశంలో పాల్గొన్న కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఎమ్మెల్యేలు, మంత్రులు మరింత చురుగ్గా పాల్గొనాల్సిన ఆవశ్యకతను వివరించారు.
వెళ్లండి...
Published Thu, Jul 23 2015 1:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement