వామపక్షాలకు విషమ పరీక్ష
Published Sun, Mar 16 2014 12:45 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: గత అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే కూటమిలో ఉన్న వామపక్షాలులోక్‌సభ ఎన్నికల్లో సైతం కొనసాగవచ్చని ఆశించారు. అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత సైతం సమ్మతించారు. అయితే సీట్ల సర్దుబాటు చర్చల్లో సీపీఐ, సీపీఎంలు తలా మూడు స్థానాలు కోరగా అన్నాడీఎంకే ఒక్కో స్థానం కేటాయించింది. ఇందుకు మనస్కరించని వామపక్షాలు అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగాయి. వెంటనే వామపక్షాలకు డీఎంకే కూటమి ఆహ్వానం పలికిన ప్పటికీ, 2జీ స్పెక్ట్రంలో డీఎంకే ఎంపీలు రాజా, కనిమొళిపై సీబీఐ కేసులు వంటివి వామపక్షాలను ఆలోచింపజేశాయి. డీఎంకేతో పొత్తుపెట్టుకుంటే భవిష్యత్ రాజకీయాల్లో దెబ్బతింటామని భావించిన కామ్రేడ్లు కరుణానిధికి నో చెప్పేశారు.
18 స్థానాల్లో: వామపక్షాలు పుదుచ్చేరితో కలుపుకుని 40 స్థానాల్లో ఒంటరిగా పోటీచేయాలని సంకల్పించారు. నియోజకవర్గాల వారీగా తమ బలాన్ని సమీక్షించుకుని బెంబేలు పడిన వామపక్షనేతలు చెరి 9 స్థానాలకు పరిమితం కావాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. అయితే ద్రవిడ పార్టీల తోడులేకుండా గెలుపు అసాధ్యమని తెలుసుకున్న ఆ పార్టీల కార్యకర్తలు పోటీచేసేందుకు ముందుకు రావడంలేదు. 1971 నుంచి ఏదో ఒక పార్టీలో భాగస్వాములై పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన వామపక్షాలు 43 ఏళ్ల తరువాత ఒంటరిగా పోటీకి దిగకతప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తమకు భారీగా బలం, బలగం ఉందని ద్రవిడపార్టీలకు వామపక్షాలు గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నాయి. మొత్తం 40 స్థానాల్లో బలంలేకనే 18 స్థానాలకు పరిమితమైనట్లు వారే అంగీకరిస్తుండగా, ఈ 18 స్థానాల్లో రేపు పడబోయే ఓట్లు వామపక్షాల పరువును నిలబెట్టగలవా అనే భయం వామపక్ష నేతల్లో నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్టు కూడా రానిపక్షంలో భవిష్యత్తులో ఏ పార్టీ వామపక్షాలతో పొత్తుకు ముందుకు రాదేమోనని బెంబేలెత్తిపోతున్నారు.
Advertisement