‘సుజనా వ్యాపారిలా మాట్లాడుతున్నారు’
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రద్దయిన కరెన్సీ నోట్లతో సమానమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సుజనా చౌదరి రాజకీయ నాయకునిలా కాకుండా వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ, 15 ఏళ్లు సాధిస్తామని టీడీపీలు హామీలు గుప్పించి ప్రజలకు ఆశలు కల్పించాయని రామకృష్ణ అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పార్టీలు మాట మార్చి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని వెంకయ్యనాయుడు అంటే, రద్దు అయిన నోటు అని సుజనా చౌదరి వ్యాఖ్యానించి వారి నోటి దురుసుతనాన్ని ప్రదర్శించడం సరికాదని రామకృష్ణ హితవు పలికారు.