
ప్రజల్లోకి వెళ్లని ఆయనకేమి తెలుసు..
హోదాపై కేంద్రమంత్రి సుజనా చేసిన వ్యాఖ్యలపై రఘువీరా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అమరావతి : ప్రత్యేక హోదాపై ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను కేంద్రమంత్రి సుజనా చౌదరి చెల్లని నోట్లతో పోల్చడం టీడీపీ దివాళా కోరుతనానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
హోదా చెల్లదని రూ. 500, 1000ల నోట్లతో పోల్చుతూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏనాడూ ప్రజల్లోకి వెళ్లని సుజనా చౌదరికి హోదా గురించి ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన చట్టబద్ధత లేని ప్యాకేజీ కోసం ప్రయత్నించడం టీడీపీ ఆడుతున్న మరో డ్రామా అని విమర్శించారు. హోదాపై ఇచ్చిన హామీని అమలు చేయకపోగా..చులకన చేయడం తగదన్నారు. చేతనైతే కాంగ్రెస్ చేస్తున్న హోదా ఉద్యమంలో భాగస్వాములు కావాలని రఘువీరా హితవు పలికారు.