'హోదాను చెల్లని నోటుతో పోల్చడం దారుణం'
విజయవాడ : ప్రత్యేక హోదాను చెల్లని నోటుతో పోల్చడం కేంద్రమంత్రి సుజనా చౌదరి అహంకారానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హోదాపై సుజనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన సుజనాకు ప్రత్యేక హోదాను అవహేళన చేసే హక్కు లేదన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల చట్టబద్ధ హక్కు అని చెప్పారు. హోదాపై చులకనగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని జోగి రమేష్ హెచ్చరించారు.
విజయవాడలో మంగళవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ...ప్రత్యేక హోదా చెల్లని రూ.500, 1000 నోట్ల లాంటిదన్నారు. రాని ప్రత్యేక హోదాను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.