క్షేమంగా నడిచొస్తే అదృష్టమే! | Crores spent on Pusa Road pavements gone waste | Sakshi
Sakshi News home page

క్షేమంగా నడిచొస్తే అదృష్టమే!

Published Mon, Nov 17 2014 10:48 PM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM

Crores spent on Pusa Road pavements gone waste

న్యూఢిల్లీ: రాజధాని వీధులు వాహనాలున్న వారికే కాదు పాదచారులకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. పాదచారులు నడిచేందుకు సరైన సదుపాయాలు లేకపోవడమే కాదు ప్రజల్లో సైతం పౌర స్పృహ లోపించడంతో ప్రాణాంతక ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు ఢిల్లీలో బహుళ అధికారాల కారణంగా, రోడ్లపై పాదచారులకు వారి వంతు భాగాన్ని కేటాయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. రోడ్లపై పాదచారులకు భద్రత కల్పించే ప్రయత్నాలలో భాగంగా విశాలమైన, సౌకర్యవంతమైన పేవ్‌మెంట్ల (కాలిబాట)ను నిర్మించడమే కాదు, ప్రస్తుతమున్న సదుపాయాలను ఉపయోగించుకోవడంపై దృష్టిని కేంద్రీకరిచాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 పేవ్‌మెంట్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం, కొన్నిచోట్ల అవి దురాక్రమణకు గురి కావటం, మరికొన్ని చోట్ల అవి నడిచేందుకు అనువుగా లేకపోవడంతో ఫుట్‌పాత్‌లపై నడవాలనుకునే పాదచారులు కూడా వాటివైపు చూడ టం లేదని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థకు చెందిన రవాణా ప్రణాళిక విభా గం మాజీ ప్రొఫెసర్ రంగనాథన్ పేర్కొన్నారు.ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి రాజధాని పురవీధుల్లో 604 మంది పాదచారులు ప్రమాదాలకు గురై మృతి చెందారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల కారణంగా 647 మంది పాదచారులు దుర్మరణం పాలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాలలో 22 శాతం పాదచారులను ఢీకొంటున్నవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గత ఏడాది రోడ్డు భద్రతపై రూపొందించిన స్థాయీ నివేదికలో వెల్లడించింది. ఐటీఓ క్రాసింగ్, తిలక్ బ్రిడ్జి మధ్య రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది.
 
 ఈ మార్గంలో రోడ్డు దాటడం పాదచారులకు కత్తి మీద సాము వంటిదే. ‘‘తిలక్ బ్రిడ్జి కింద ఉన్న పేవ్‌మెంట్ ఎంత ఇరుకుగా ఉన్నదంటే... ఒక్క వ్యక్తి కూడా అటు నుంచి ఇటు సౌకర్యవంతంగా వెళ్లలేరు’’ అని ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ ముక్తేష్ చందర్ అన్నారు. మన దేశంలో రోడ్లపై పాదచారులకు అంత ప్రాధాన్యత లేదని అన్నారు. తిలక్‌బ్రిడ్జి కింద ఇరుకుగా ఉన్న పేవ్‌మెంట్ పక్కన రవాణా మార్గాన్ని పూర్తిగా పాదచారులకు, మోటారురహిత ట్రాఫిక్‌కు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) చీఫ్ ఇంజనీర్ దినేశ్ కుమార్ చెప్పారు.నగరంలో 33,198 కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారులు ఉన్నాయి. వీటిలో అనేకరోడ్లపై పేవ్‌మెంట్లు నిర్మించామని దినేశ్ కుమా ర్ చెప్పారు. ఐటీఓ-తిలక్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రగతి మైదాన్ మెట్రోస్టేషన్‌ను ఐటీఓకు అనుసంధానం చేస్తూ ఓ స్కైవాక్‌ను నిర్మించాలని కూడా నిర్ణయించామని తెలిపారు.
 
 ఇదిలాఉండ గా, ప్రస్తుతమున్న పేవ్‌మెంట్లు, వంతెనలు, సబ్‌వేలను పూర్తిగా ఉపయోగించుకోగలిగితే పాదచారులకు పూర్తి భద్రత కల్పించవచ్చని, అయితే వారికి వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలని రంగనాథన్ సూచించారు. నగరం లో కొన్ని జోన్లను పూర్తిగా పాదచారులకు కేటాయించాలన్నారు. పౌరుల్లో నడిచే సంస్కృతిని అలవాటు చేయడాన్ని కూడా పరిశీలించాలన్నా రు. అలాగే వృద్ధులు, వికలాంగులు ఒకేసారి రోడ్డు దాటలేరు కాబట్టి, వారి కోసం రోడ్డు మధ్యలో ఒక ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన లోపం కూడా ప్రమాదాలకు కారణమని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ చందర్ పేర్కొన్నారు. ఇక కొన్ని చోట్ల పేవ్‌మెంట్లను పాదచారులు నడవలేని విధంగా అస్తవ్యస్తంగా నిర్మించారని చెప్పారు. నగరంలోని 68 సబ్‌వేలు, పాదచారుల వంతెనలను అనువునగా లేని చోట నిర్మించారని అన్నారు. ముంబై తరహాలో పొడవైన స్కైవాక్‌లను నిర్మించాలని చందర్ సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement