న్యూఢిల్లీ: దేశంలో ప్రతి పది నిమిషాలకు ముగ్గురు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఒక్క 2015 సంవత్సరంలోనే దేశంలో 1,48,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. 2011లో 1,36,000 మంది మరణించారు. 1015 నాటికి గడచిన నాలుగేళ్ల కాలంలో రోడ్డు ప్రమాద మతులు నాలుగు శాతం పెరిగింది.
ట్రాఫిక్ సంబంధిత ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో రోడ్డు ప్రమాద మృతులు 83 శాతం మంది ఉంటున్నారు. రైలు ప్రమాదాల్లో మరణిస్తున్న వారు 85 శాతంకాగా, కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఢీకొనడం వల్ల రెండు శాతం మరణిస్తున్నారు. 2015 సంవత్సరంలో 4,64,000 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 2014లో 4,50,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే ఒక్క సంవత్సరంలోనే మూడు శాతం పెరిగాయి.
తమిళనాడులో 69,059, కర్ణాటకలో 44,011, మహారాష్ట్ర 42,250 రోడ్డు ప్రమాదాలు జరిగి మొదటి మూడు స్థానాలు ఆక్రమించగా, 18,403 మంది రోడ్డు ప్రమాద మృతులతోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముందున్నది. జాతీయ స్థూల ఉత్పత్తికి జాతీయ రోడ్డు రవాణా రంగం నుంచి 4.8 శాతం సమకూరుతుండగా, రోడ్డు ప్రమాదాల కారణంగా అందులో 1 నుంచి 3 శాతం వరకు నష్టం వస్తోందని 11వ ప్రణాళికా కమిషన్ 2007లో విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది.
2015లో సంభవించిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 29 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలతో జరిగినవే. ఈ ప్రమాదాల్లో 45,540 మంది మరణించారు. ట్రక్కుల వల్ల 19 శాతం ప్రమాదాలు సంభవించగా, 28,910 మంది మరణించారు. 12 శాతం కారు ప్రమాదాల్లో 18,506 మంది మరణించారు. తమిళనాడు, మహారాష్ట్రలో ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణించగా, ఉత్తరప్రదేశ్‌లో ట్రక్కు, కారు ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణించారు. దేశంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారులు 1.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 28 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైనే జరిగాయి.
దేశవ్యాప్తంగా వేగ పరిమితులు విధించినా, సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేసినా, మద్యం సేవించి వాహనాలను నడపడాన్ని కఠినంగా నియంత్రిస్తున్నా దేశంలో నానాటికి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి.