అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి కర్ఫ్యూలో చిక్కుకున్న వైనం
తిండీ తిప్పలు లేక ఇబ్బందులు
మూడు రోజులుగా బస్సులోనే మకాం
మందులు లేక మధుమేహ రోగుల అవస్థలు
ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
బెంగళూరు: అమర్‌నాథ్ యాత్ర కోసం కర్ణాటక నుంచి బయలుదేరిన యాత్రికులు కశ్మీర్ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాశ్మీర్‌లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కర్ఫ్యూ విధించడంతో యాత్రికులంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న బుహ్రాన్ హాని ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కాశ్మీర్‌లో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కర్నాటకలోని బెంగళూరు, రాయచూరు, కొప్పళ్, యాదగిరి తదితర ప్రాంతాల నుంచి కిసాన్ యాత్రి సేవా సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ అమర్‌నాథ్‌యాత్రలో భాగంగా శ్రీనగర్ చేరుకున్న దాదాపు వందలాది మందిలో ఎక్కువ మంది పఠాన్‌ఛౌక్ ప్రాంతంలో ఉండిపోయారు. ప్రయాణిస్తున్న బస్సులోనే ఉండిపోయి స్థానిక పోలీసు, సైన్యం సూచనల మేరకు బయటికి రావడం లేదు.
ఇదిలా ఉండగా మౌలిక సదుపాయాలు, శౌచాలయాలు లేక కన్నడిగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంట తీసుకువెళ్లిన ఆహారపదార్థాలు కూడా అయిపోయాయని తెలుస్తోంది. డబ్బులు ఉన్నా తిండి పదార్థాలను కొనుక్కోలేని పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, మదుమేహంతో బాధపడుతున్న వారు సరైన వైద్య సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రికుల్లోని కన్నడిగుల రక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వీరిలో కొంతమందిని శ్రీనగర్‌కు పంపించగా మరికొంతమంది ఢిల్లీలోని కర్ణాటకభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో ఉంటూ యాత్రికుల వివరాలను వారి బంధువులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, అమర్‌నాథ్ యాత్రికుల విషయమై తెలుసుకోవడానికి 01942506479, 09868393952,9868393953,9868393979లలో సంప్రదించవచ్చు.
కశ్మీర్‌లో కన్నడిగుల కష్టాలు
Published Tue, Jul 12 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement