= అసెంబ్లీలో అమాత్యుల వెల్లడి..
= వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్
= ‘అక్రమ’ విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తాం
= 2.32 లక్షల దరఖాస్తులొచ్చాయి
= క్రమబద్ధీకరణకు సుమారు రూ. రెండు వేల కోట్లు అవసరం
= నిధుల లభ్యతను బట్టి దశల వారీగా కార్యాచరణ
= ఏపీఎంసీలో పంట విక్రయించినరోజే డబ్బు
= చెక్కు రూపేణా చెల్లింపు.. 5 రోజుల్లో అమల్లోకి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వ్యవసాయానికి రోజుకు ఏడు గంటల పాటు కరెంటు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ శుక్రవారం శాసన సభకు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు గంటల సరఫరా జరిగేదని, గురువారం నుంచి మరో గంట పాటు పొడిగించామని వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు కేబీ. కోళివాడ్, డాక్టర్ ఏబీ. మాలక రడ్డి ్రృభతులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రం అక్రమ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను దశల వారీ క్రమబద్ధీకరిస్తామని చెప్పారు.
ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందన్నారు. మొత్తం 2.32 లక్షల దరఖాస్తులు అందగా, ఇప్పటికే లక్షకు పైగా అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించామని వెల్లడించారు. ఒక్కో కనెక్షన్‌ను క్రమబద్ధీకరించడానికి రూ. లక్షన్నర ఖర్చవుతుందని తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను క్రమబద్ధీకరించాలంటే రూ. రెండు వేల కోట్లు అవసరమవుతుందని చెప్పారు. అదనంగా వచ్చిన అర్జీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో రూ.1,500 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.
నిధుల లభ్యతను బట్టి దశల వారీ క్రమబద్ధీకరణను చేపడతామన్నారు. రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుండడంతో వీలైనంత త్వరగా కొత్త విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడానికి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వ సబ్సిడీతో నిమిత్తం లేకుండా రైతులు సొంత ఖర్చుతో విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు సమకూర్చుకుంటే ప్రత్యేక కనెక్షన్లను ఇస్తామని తెలిపారు. కాగా రైతులకు ప్రభుత్వం ఏటా రూ.6,200 కోట్ల విద్యుత్ సబ్సిడీని ఇస్తోందని ఆయన వెల్లడించారు.
అమ్మిన రోజే డబ్బు
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సొసైటీల్లో (ఏపీఎంసీ) రైతులు పంట ఉత్పత్తులను విక్రయించినరోజే డబ్బు చెల్లించే సదుపాయాన్ని మరో 15 రోజుల్లో ప్రారంభించనున్నట్లు ఉద్యానవనాల శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు జేటీ. పాటిల్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డబ్బు చెల్లింపులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఏపీఎంసీ చట్టానికి సవరణలు తెచ్చామని వెల్లడించారు. అనంతరం నియమావళిని రూపొందించామని, దీనిపై అభ్యంతరాలుంటే తెలియజేయడానికి 15 రోజులు గడువు ఇచ్చామని వివరించారు. గడువు ముగిసిన వెంటనే ఏరోజుకారోజు చెక్కు రూపేణా చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తామన్నారు. చెక్కులు నిరాదరణకు గురైనట్లు తమృదష్టికి వస్తే, దానిపై విచాణ జరిపిస్తామని ఆయన తెలిపారు.
కరెంట్ హమీ
Published Sat, Jan 25 2014 5:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement