హొసూరు : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చే భూసేకరణ చట్టంతో క్రిష్ణగిరి జిల్లా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. కేంద్రం తీసుకొచ్చే ఈ చట్టంతో జిల్లాలోని రైతులు వేలకు వేల ఎకరాలను కోల్పోవాల్సి వస్తుంది. గెయిల్ సంస్థ కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి బెంగళూరుకు గ్యాస్ పైప్‌లైన్ మార్గాన్ని జిల్లా మీ దుగా తీసుకెళ్తుంది. ఇందువల్ల విలువైన పంటలు పండే భూములను రైతులు కోల్పోవాల్సి వస్తుంది. రెండేళ్లుగా ఈ ప్రయత్నం గెయిల్ సంస్థ చేస్తున్నప్పటికీ రైతులు దీన్ని అడ్డుకొంటూ వస్తున్నారు.
భూసేకరణ చట్టం అమలులోకి వస్తే గెయిల్ సంస్థకు ఇక్కట్లు తప్పుతాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. హొసూరు తాలూకా సూళగిరి ప్రాంతంలో మూడో సిప్‌కాట్‌కు 5 వేల మందికి పైగా రైతులకు సంబంధించిన భూములు సేకరిస్తున్నారు. ఈ చర్యలను కూడా రైతులు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా సిప్‌కాట్ భూసేకరణపై మండిపడుతున్నాయి. భూసేకరణ చట్టం అమలులోకొస్తే భూసేకరణ సులువుగా ఉంటుందంటున్నారు. హొసూరు-బాగలూరు రోడ్డులోని వేలాది ఎకరాల ఇనాం భూములు కూడా ప్రభుత్వం స్వాధీ నం చేసుకొనేందుకు మార్గం సుగమం అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
సెజ్‌ల పేరుతో, ఐటీ పార్కుల పేరుతో రైతులు విలువైన భూములను బడా పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసేందుకు భూసేకరణ చట్టాన్ని ఉపయోగిస్తారని రాజకీయ పార్టీలు వాపోతున్నాయి. ఇప్పటికే క్రిష్ణగిరి జిల్లాలో జాతీయ రహదారి, మొదటి సిప్‌కాట్, రెండో సిప్‌కాట్ పేరుతో, ఐటీ పార్కు పేరుతో, గృహవసతి కాలనీల పేరుతో వేలాది ఎకరాల పంట భూములను లాక్కొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు కూతవేటు దూరంలోని హొసూరు పరిశ్రమలకు అనువైనదిగా గుర్తించి భూములను లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకొనే వారు కూడా లేకపోవడంతో పరిశ్రమాధిపతులు ఇక్కడ పెట్టుబడులకు ఇష్టపడుతున్నారు.
భూసేకరణ చట్టం రైతులకు శాపం
Published Tue, Jun 2 2015 5:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement