తెలుగునేలపై పీడకలకు రెండేళ్లు
తెలుగునేలపై పీడకలకు రెండేళ్లు
Published Tue, Oct 11 2016 7:47 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
విశాఖపట్టణం: జనజీవనంలో ప్రళయాన్ని సృష్టించిన తీవ్ర పెను తుపాను హుద్ హుద్... శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో అంతులేని అపార నష్టాన్ని మిగిల్చిన ఈ ఘటనకు నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. సమాచార వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో పాటు వేల ఎకరాల్లో పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హుద్ హుద్ విసిరిన పంజాకు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖ పట్టణం విషాద నగరంగా మారిపోయింది. తెలుగు నేలపై తుపాన్ల అలజడి కొత్త కాక పోయినా హుద్ హుద్ రూపంలో పోటెత్తిన విపత్తు ఓ పీడకలగా మిగిలిపోతుంది.
అసలు ఆ రోజు ఏం జరిగింది?
2014 అక్టోబరు 12... ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రాంతంలో గంటకు 210 కిలోమీటర్ల వేగం తో విశాఖ వద్ద హుద్ హుద్ తీరాన్ని దాటింది. మునుపెన్నడూ విశాఖ సమీపంలో తీరం దాటిన దాఖలాలు పెద్దగా లేవు. అప్పుడు బంగాళా ఖాతంలో ఏర్పడిన తుపాను ఉక్కునగరం వద్దనే తీరం దాటింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని, దాని తీవ్రతను అమెరికాకు చెందిన నాసా మూడు రోజుల ముందే తెలియజేసింది. నాసాకు చెందిన ఆక్వా అనే ఉపగ్రహం పంపిన పలు చిత్రాల ఆధారంగా తుపాను తీవ్రతను నిపుణులు అంచనా వేశారు. దాని ప్రభావం అసాధారణంగా ఉంటుందని నాసా అంచనా వేసింది. భారత్‌కు పొడవైన తీర రేఖ ఉండటంతో తుపాను ప్రభావం కూడా అధికం. 2013లో ఫైలిన్ ప్రభావాన్ని చవిచూసిన మన దేశం... హుద్ హుద్ పెను తుపానుకు లోనైంది.
అందని పరిహారం
గంటకు 210 కిలోమీటర్లతో గాలులు వీస్తే నష్టం ఊహించలేనిదిగా చెప్పవచ్చు. హుద్ హుద్ తుపాను సమయంలోనూ ఇదే వేగంతో గాలులు వీచాయి. పర్యవసానం అంచనాలకు అందని నష్టం నమోదైంది. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. హుద్ హుద్ తుపాను ప్రభావానికి 40 మంది మరణించారు. సుమారు 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ హుద్ హుద్ బాధితులకు పరిహారం అందలేదు. అక్టోబర్ 12 అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. హుద్ హుద్ మానని గాయంగా మిగిలింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Advertisement