► రోడ్డెక్కిన దీప, మాధవన్‌ల పోరు
► దీప డౌన్ డౌన్ అంటూ నినాదాలు
► ఇరువర్గాల ఘర్షణలతో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంజీఆర్ అమ్మ దీప పేరవైలోని విభేదాలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి. దీప, ఆమె భర్త మాధవన్ వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. జయలలిత వారసురాలిగా రాజకీయ తెరపైకి వచ్చిన దీప ఆ పార్టీని స్వాధీనం చేసుకుంటారని అందరూ భావించారు. అయితే తాను సొంతగా పేరవైని స్థాపించి అధ్యక్షురాలిగా తన డ్రైవర్ భార్యను, ప్రధాన కార్యదర్శిగా డ్రైవర్ ఏవీ రాజాను నియమించారు. తాను సిఫారసు చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని కోపగించుకున్న దీప భర్త మాధవన్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు.
పార్టీ పెద్దలు సమాధానపరచడంతో మళ్లీ కలిశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త కాలమ్‌ను ఖాళీగా పెట్టడం మాధవన్‌ను మళ్లీ ఆగ్రహానికి గురిచేయడంతో మళ్లీ వెళ్లిపోయారు. ఒక దశలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది. దంపతుల మధ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం దీప ఇంటి ముందు అంబేడ్కర్ జయంతికి ఏర్పాట్లు జరిగాయి. మాధవన్ అన్నాడీఎంకే పార్టీ రంగులతో ఉన్న పంచెను కట్టుకుని వేడుకల్లో పాల్గొనేందుకు అనుచరులతో హాజరయ్యారు.
దీప రాకకోసం మాధవన్ ఇంటి బైటే వేచి చూసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో ఆయన అనుచరులు దీప అనుచరులతో వాగ్విదానికి దిగి గేటు తోసుకుని లోపలికి వెళ్లారు. వీరిని డ్రైవర్ ఏవీ రాజా, అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు మంచినీళ్ల బాటిళ్లు, రాళ్లు విసురుకున్నారు. ఘర్షణ పడవద్దని దీప కేకలు వేసినా ఎవ్వరూ వినిపించుకోలేదు. పేరవైలో గొడవలన్నింటికీ నీవే కారణమని కొందరు ఏవీ రాజాను దూషించగా, దీప డౌన్ డౌన్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించేశారు.