అన్న కూతురు వారసత్వ పోరు | deepa wants Succession of jayalalitha | Sakshi
Sakshi News home page

అన్న కూతురు వారసత్వ పోరు

Published Sat, Oct 8 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

అన్న కూతురు వారసత్వ పోరు

అన్న కూతురు వారసత్వ పోరు

• జయలలిత వారసత్వాన్ని ఆశిస్తున్న దీప
• అపోలో ఆసుపత్రిలో కలుసుకునే యత్నం

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసురాలిని తానేనంటూ తెరపైకి వచ్చారు ఆమె అన్న కుమార్తె దీప. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో దీప ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జయలలిత స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మిని వివాహం చేసుకుని జయలలితతోపాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది. ఆ తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఆయన పోయెస్ గార్డెన్ వదిలి చెన్నై టీనగర్‌లో కాపురం పెట్టారు.

1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. 2013లో వదిన చనిపోయినపుడు జయలలిత వెళ్లలేదు. ఇటీవలే జరిగిన మేనకోడలు దీప వివాహానికీ హాజరు కాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొంది వచ్చారు. ఈ సందర్భంగా వధూవరులకు అత్త హోదాలో జయలలిత ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. దీప వైవాహిక జీవితం కొన్నాళ్లు సజావుగా సాగినా ఆ తరువాత భర్తతో విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భర్తకు దూరమై, తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన దీప అత్త జయలలితకు చేరువకావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జయ ఇంటి వద్ద గంటసేపు నిరీక్షించినా అనుమతి రాలేదు. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఈ ఇల్లు మా నానమ్మ (జయలిత తల్లి సంధ్య) నాకు రాసిచ్చింది. దస్తావేజులు కూడా ఉన్నాయి.

మా ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మీరు ఎవరు?’ అంటూ ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడ్డారు. మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం గార్డెన్‌లోని కొందరికి ఇష్టం లేదని దీప పరుషవ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలిసింది. జయను కలిసేందుకుఆగస్టులో మరోసారి ప్రయత్నించి విఫలమయ్యారు. ‘అత్తా... కలుస్తా’ అంటూ రాసిన ఉత్తరాలకు కూడా బదులు రాలేదు. జయలలితే స్వయంగా తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని ఆశిస్తూ దీప తన ప్రయత్నాలు కొనసాగించారు. ఇది గమనించి వారి కుటుంబ మిత్రుడైన ఒక బీజేపీ సీనియర్ నేత దీపను సున్నితంగా వారించారు. వారసత్వంకోసం ఓపిక పట్టాల్సిందిగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

లండన్‌లో ఉన్నత విద్యనభ్యసించిన దీపకు ఆయన అమెరికాలో ఒక ఉద్యోగం చూసి పెట్టారు. ఇంతలో జయ అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరడంతో దీప తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆసుపత్రిలో తన అత్తను చూసేందుకు అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తులను అన్నాడీఎంకే నేతలు పట్టించుకోలేదు. దీంతో తనకు తానుగానే అపోలో వద్దకు చేరుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సీఎం జయలలిత సుదీర్ఘకాలం అపోలో ఆసుపత్రిలోనే ఉండాలని అపోలో వైద్యులు ప్రకటించడంతో దీప తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement