ఇవేం పరువు దావాలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్ష నేతలపై తమిళనాడు ప్రభుత్వం వరుసగా దాఖలు చేస్తున్న పరువునష్టం దావాలపై సుప్రీంకోర్టు విస్తుపోయింది. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు, మరేరాష్ట్రంలో లేని విధం గా ఇవేం పరవునష్టం దావాలు బాబోయ్ అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు ఎన్ని పరవునష్టం దావాలు వేసారో రెండువారాల్లోగా జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, సతీమణి ప్రేమలతపై తిరుపూరు కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది నవంబరులో తిరుపూరులో జరిగిన డీఎండీకే బహిరంగసభలో అన్నాడీఎంకే ప్రభుత్వ ఉచిత వస్తువుల పంపిణీపై విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శలు పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత పేరు ప్రతిష్టలకు భంగకరమని పేర్కొంటూ విజయకాంత్, ప్రేమలతలపై తిరుపూరు కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ఈ దావాతోపాటూ తమపై పెట్టిన పరువునష్టం కేసులన్నీ కొట్టివేయాల్సిందిగా కోరుతూ విజయకాంత్, ప్రేమలతలు డీఎండీకే తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే దాఖలు చేసిన పరువునష్టం దావా తిరుప్పూరు కోర్టులో ఈనెల 26వ తేదీన విచారణకు వచ్చింది. విజయకాంత్, ప్రేమలత కోర్టుకు హాజరుకాకపోవడంతో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్ జారీచేసింది.
దీంతో డీఎండీకే డిల్లీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాదైన జీఎస్ మణి బుధవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తి దీపక్‌మిశ్రా ముందు హాజరయ్యారు. అన్నాడీఎంకే తమ వారిపై వేసిన అన్ని పరువునష్టం దావాలకు సుప్రీంకోర్టు గతంలోనే స్టే మంజూరు చేసి ఉన్న స్థితిలో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. తమ పిటిషన్‌ను స్వీకరించి తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, రోకింగ్టన్ గురువారం విచారణకు స్వీకరించారు. తమిళ నాడు ప్రభుత్వ తరఫు న్యాయవాది యోగేష్‌ఖన్నా, పసంద్, జీఎస్ మణి హాజరైనారు. సుప్రీం కోర్టులో స్టే విధించి ఉండగా తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్‌ను ఎలాజారీ చేస్తుందని జీఎస్ మణి వాదించారు. పరువునష్టం దావాలపై సుప్రీం కోర్టు స్టే విధించలేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు.
పరువునష్టం కేసులు తమిళనాడులోనే..
ఈ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మధ్యలో కలుగజేసుకుని తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమిళనాడులో మాత్రమే ఎందుకు పరువునష్టం దావాలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాలకు ఉన్న హక్కు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు బనాయించడం లేదు. తమిళనాడులో మాత్రమే ఎందుకు ఇన్ని పరువునష్టం కేసులు దాఖలవుతున్నాయి. ఇంతవరకు తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున ప్రభుత్వ న్యాయవాదులు ఎవరెవరిపై పరువునష్టం దావాలు వేశారో మొత్తం జాబితాను రెండువారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విజయకాంత్, ప్రేమలతలపై జారీచేసిన పీటీ వారెంట్‌పై స్టేను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసును సెప్టెంబరు 21వ తేదీకి వాయిదావేశారు.