తమ పార్టీకి కంచుకోటలుగా భావించిన నాలుగు సీట్లలో, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటమి ఎదురు కావడంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీకి కంచుకోటలుగా భావించిన నాలుగు సీట్లలో, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటమి ఎదురు కావడంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ సీట్ల నుంచి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం! గ్రేటర్ కైలాష్, రోహిణీ, షాలీమార్‌బాగ్, షాకుర్‌బస్తీ.. ఈ నాలుగు సీట్లు బీజేపీకి కంచుకోటలుగా పేరొందాయి. ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి బీజేపీ పలుమా ర్లు విజయం సాధించింది. కానీ గత ఎన్నికలలో మా త్రం ఓటమిపాలైంది. దాంతో ఈ నియోజకవర్గాల నుంచి కొత్తవారిని నిలబెట్టాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 70 సీట్ల లో 32 సీట్లు గెలిచింది. ఈ నాలుగు సీట్లలో కూడా బీజే పీ అభ్యర్థులు గెలిచినట్లయితే ఢిల్లీలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేది. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజే పీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ తగిన సం ఖ్యాబలం లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిం ది. ఈ సీట్లను తిరిగి గెలిచినట్లయితే వాటి ప్రభావం పక్కనున్న సీట్లపై కూడా పడుతుందని, బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల వ్యూహరచన కోసం ఆ పార్టీ జరుపుతోన్న సమావేశాలలో ఈ అంశం చర్చకు వచ్చింది. మితీమిరిన ఆత్మవిశ్వాసం, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం, అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీ ఈ నాలుగు నియోజకవర్గాలను కోల్పోయింది. ఇప్పుడీ సీట్లనుంచి ఇతరులను బరిలోకి దింపాలని పార్టీ వ్యూహరచన చేస్తోంది.
ముఖ్యంగా గ్రేటర్ కైలాష్‌లో ఓటమిని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. 2008 అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవ ర్గం నుంచి సీనియర్ నేత విజయ్‌కుమార్ మల్హోత్రా గెలిచారు. 2013 ఎన్నికలలో ఆయన కుమారుడు అజయ్ మల్హోత్రాకు టికెట్ లభించింది. కానీ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. మరో బీజేపీ నేత విజయ్ జోలీ కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మేయర్ ఆర్తీ మెహ్రా కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆమెను మాలవీయనగర్ నుంచి బరిలోకి దింపవచ్చు.
రోహిణీ విషయానికి వస్తే 1993 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భగవాన్ గోయల్ 2013 ఎన్నికలలో ఓడిపోయారు. దాంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ విజేందర్‌గుప్తాకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో విజేందర్ గుప్తా న్యూఢిల్లీ నియోజవర్గం నుంచి షీలాదీక్షిత్, అర్వింద్ కేజ్రీవాల్‌లతో పోటీపడి ఓడిపోయారు. షాకుర్ బస్తీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈసారి ఇక్కడనుంచి శ్యామ్‌లాల్‌గర్గ్ లేదా రేఖా గుప్తాకు టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. షాలీమార్‌బాగ్‌కు 1998 నుంచి ప్రాతినిధ్యం వహించిన రవీంద్ర భన్సల్ గత ఎన్నికలలో ఆప్ చేతిలో ఓడిపోవడంతో ఇక్కడ కూడా కొత్త వారికి టికెట్ ఇచ్చే విషయం పార్టీ పరిశీలనలో ఉంది.