ఆప్‌ను కాపీ కొడుతున్న బీజేపీ
* నియోజకవర్గాలవారీ ప్రణాళికలకు రూపకల్పన
* ఎన్నికల వాగ్దానాలపై సలహాలు,సూచనలివ్వాలని నేతలకు ఆదేశం
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రణాళికను రూపొందించడంలో ఈసారి ఆప్ బాటను అనుసిరంచాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ మేనిఫెస్టో రూపకల్పనలో నూతన ఒరవడిని సృష్టించి విజయం సాధించిన ఆప్ బాటలోనే పయనించి ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నారు.
ఎన్నికల సీజన్‌లో ఓటర్లను ఆకట్టుకునేందుకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాల హామీలతో ఓ ప్రణాళికను రూపొందించి ప్రకటిస్తాయి. ఈ ప్రణాళికలోని అంశాలు దాదాపు రాష్ట్రం మొత్తానికి వర్తించేలా ఉంటాయి. కానీ గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్తగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గానికో ప్రణాళికను రూపొందించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ నూతన ప్రయోగంతో ఓటర్లను ఆకట్టుకున్న ఆప్ ఏకంగా అధికార పగ్గాలను చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా అదే అస్త్రాన్ని ప్రయగించాలని యోచిస్తోంది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ప్రత్యేక ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు గాను సలహాలు, సూచనలు ఇవ్వాలని బీజేపీ తమ మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులను కోరింది. ఈ విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి రేఖా గుప్తా అనధికార కాలనీల క్రమబద్ధీకరణ, ఇ-రిక్షాలకు అనుమతి, నీరు-విద్యుత్ బిల్లుల్లో రాయితీలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై నాయకులతో చర్చలు జరిపారు. అయితే ఇది స్థానిక నాయకుల నుంచి వచ్చే నిర్దిష్టమైన డిమాండ్లను అంచనా వేసేందుకు జరిగిన అనధికార సమావేశమని కొందరు మాజీ ఎమ్మెల్యేలు చెప్పారు.
బీజేపీ నేతృత్వంలోని మొత్తం మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఈసారి పన్నుల ప్రతిపాదనలను పూర్తిగా ఎత్తివేయాలని కొందరు కౌన్సిలర్లు కోరారు. గత ఎన్నికల సమయంలో కూడా తాము కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని ఓ నాయకుడు చెప్పారు. మోడల్ టౌన్ వంటి నియోజకవర్గంలో ఈ ప్రయోగం చేశామని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరించడానికి ఓ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నామని బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఓ) ప్రమాణాల స్థాయికి ఆస్పత్రులు, స్కూళ్లను తీసుకెళ్లే విషయాన్ని కూడా తమ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని ఆయన తెలిపారు. హర్యానా నుంచి మరింత అధికంగా యమునా నీటిని తెచ్చుకొనే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ఢిల్లీ విభాగం ఈనెల 29న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు పౌర సన్మానం ఏర్పాటు చేసిందని ఉపాధ్యాయ చెప్పారు.