ఇవిగో ఆధారాలు!
ఇవిగో ఆధారాలు!
Published Thu, Mar 6 2014 10:23 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
న్యూఢిల్లీ:త మ పార్టీ కార్యాలయం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు గురువారం హింసాత్మక కార్యకలాపాలకు దిగడంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆప్ నేతల ఆగడాలకు సంబంధించిన సీడీని పార్టీ నేతలు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, హర్షవర్ధన్, నళిన్ కోహ్లీ తదితర నేతలు ఢిల్లీ ఎన్నికల కమిషనర్‌కు అందజేశారు. కోడ్ అమల్లోకి వచ్చినా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆమ్ ఆద్మీ పార్టీపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా డిమాండ్ చేశారు. ఆప్ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపైనా, కార్యకర్తలపై చేసిన దాడిని గురించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేసినట్లు బీజేపీ నేత నళిన్ కోహ్లీ చెప్పారు. ఆప్ నిధులకు సంబంధించిన అక్రమాలను కూడా హర్షవర్ధన్ ఎన్నికల కమిషన్ ముందుంచారని కోహ్లీ తెలిపారు.
ఎన్నికల తేదీని ప్రకటించిన రోజే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన రోజే... ఇలా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆప్‌పై సముచిత రీతిలో చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. ఈ నిరసన ప్రదర్శన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ నేతృత్వంలో జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. అశుతోష్ బీజేపీ కార్యాలయం గోడపై ఎక్కిన దృశ్యాలు, కార్యకర్తలను రెచ్చగొట్టిన దృశ్యాలు, ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సేకరించి, సీడీ రూపంలో ఎన్నికల సంఘానికి అందజేశామన్నారు. నిరసన ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్‌ఎంఎస్‌లు పంపించిందని, షాజియా ఇల్మీ కూడా నిరసన ప్రదర్శనలో చురుకైన పాత్ర పోషించారని, ఈ విషయాలను కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
పోలీసుల కఠిన చర్యలు...
బీజేపీ కార్యాలయం ముందు ఆందోళన చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆప్ కార్యకర్తల్లో 14 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆప్ నేతలు అశుతోష్, షాజియా ఇల్మీని పోలీసులు గురువారం ఈ ఘటన గురించి ప్రశ్నించారు. ఆప్ నేతలను, ముఖ్యంగా అశుతోష్‌ను పోలీసులు అరెస్టు చేస్తారన్న వార్తలతో రోజంతా ఆందోళనతో గడిపిన నేతలు సాయంత్రం వారిని అరెస్టు చేయరన్న వార్తతో ఊపిరిపీల్చుకున్నారు. ఆశుతో్‌ష్‌పై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద ఎప్‌ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు గురువారం ఆయనను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు.
షాజియా ఇల్మీని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించారు. వారి వాంగ్మూలాన్ని నమోదుచేశారు. మోడల్ టౌన్‌లోని ఆప్ కార్యాలయం నుంచి అశుతోష్‌ను, షాజియా ఇల్మీని గ్రేటర్ కైలాష్‌లోని ఆమె నివాసం నుంచి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆప్ నేతలను అరెస్టు చేస్తారనే వార్తలు రావడంతో వారిని తీసుకెళ్లడానికి వచ్చిన ఢిల్లీ పోలీసులు ఆప్ కార్యకర్తల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవలసి వచ్చింది. మోడల్ టౌన్ ఆప్ కార్యాలయం వద్ద, షాజియా నివాసం వద్ద భారీ స్థాయిలో గుమిగూడిన ఆప్ కార్యకర్తలు తమ నేతలకు మద్దతు ప్రకటించారు.
బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన కు సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసులు అశుతోష్, షాజియా ఇల్మీ, ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్ లతోపాటు 17 మందిపై ఢిల్లీ పోలీసులు ఎ్‌ఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పోలీసులు బుధవారం అరెస్టు చేసిన 14 మంది కార్యకర్తలను పటియాలాహౌజ్ కోర్టు గురువారం బెయిల్‌పై విడుదల చేసింది. 15,000 రూపాయల ధరావత్తుపై న్యాయస్థానం వారిని విడుదల చేయాలని ఆదేశించింది. ఆప్ నేత ప్రశాంత్‌భూషణ్ వారి తరఫున వాదించారు. ఆప్ కార్యకర్తలపై బిజెపి అసత్య కేసులు పెట్టిందని, దానిని తాము సుప్రీంకోర్టులో సవాలుచేస్తానని ఆయన చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీపై బిజెపి. బిజెపిపై ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశాయి. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు ఆప్ కార్యకర్తలు, నేతలపై సెక్షన్ 145 కింద చట్టవిరుద్దధంగా గుమిగూడడం, సెక్షన్ 147 కింద అల్లర్లను రెచ్చగొట్టడం, సెక్షన్ 149 కింద అక్రమ కార్యాకలాపాలు, సెక్షన్ 322 కింద విధినిర్వహణలో ప్రభుత్వోద్యోగులను అడ్డుకోవడం, సెక్షన్ 353 కింద ప్రభుత్వోద్యోగులపై దాడి, సెక్షన్ 427 కింద ఆస్తులకు నష్టం కలిగించడం ఆరోపణలపై కేసులు నమోదుచేసి చర్యలు చేపట్టారు.
ఆప్ కార్యాలయం వద్ద ఉధ్రిక్తత..
అశుతోష్‌ను పోలీసులు అరెస్టు చేయవచ్చన్న ఊహాగానాలు వినిపించడంతో పలువురు ఆప్ కార్యకర్తలు మోడల్‌టౌన్‌లోని ఆప్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోడల్ టౌన్ కార్యాలయానికి చేరుకున్నారు. ముగ్గురు ఏసీపీలతో పాటు వచ్చిన పోలీసు బలగాన్ని ఆప్ కార్యకర్తలు ప్రతిఘటించారు. కార్యాలయం గేటు, తలుపు మూసి పోలీసులు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ పోలీసులు వారికి నచ్చచెప్పి పోలీసు అధికారులు ఆప్ కార్యాలయంలోకి వెళ్లి అశుతోష్‌తో పాటు ఇతర నేతలతో మాట్లాడారు. పోలీసులు అశుతోష్, మోడల్ టౌన్ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేమందు అశుతోష్ విలేఖరులతో మాట్లాడుతూ... ప్రశ్నించడం కోసం పోలీసులు తనను తీసుకువెళ్తున్నారని చెప్పారు. తాను చట్టప్రకారం నడిచే పౌరుడినని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. శాంతియుతంగా వ్యవహరించాలని అశుతోష్ కార్యకర్తలను కోరారు.
ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడరాదని, హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై పార్టీ కఠిన చర్య తీసుకుంటుందని ఆయన పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు.పోలీసులతో బయలుదేరేముందు షాజియా విలేకరులతో మాట్లాడారు. తనను పోలీసులు ఎందుకు తీసుకెళ్త్తున్నారో తెలియదన్నారు. తాము బీజేపీ కార్యాలయం ఎదుట శాంతిపూర్వకంగా ప్రదర్శన నిర్వహించామని, తాను ఎలాంటి హింసకు పాల్పడలేదని ఆమె చెప్పారు. బీజేపీ కార్యకర్తలే తమపై రాళ్లు రువ్వారని ఆమె ఆరోపించారు. ముందస్తు బెయిలు కోసం తాను దరఖాస్తు చేసుకోనని చెప్పారు. తాము గొంతెత్తుతామే కానీ చేయెత్తమన్నారు. తమ తరఫున ఏదైనా తప్పు జరిగినట్లయితే ఇదే మొదటి.. సారి చివరిసారని ఆమె చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ఆమె ప్రశ్నించారు.
హనుమాన్‌రోడ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద, అశోకా రోడ్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. బుధవారం సాయంత్రం బీజేపీ కార్యాలయం ఎదుట ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన హింసాత్మక దాడిలో ఆప్, బీజేపీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, పోలీసులతో పాటు మొత్తం 30 మంది గాయపడ్డారు. బుధవారం నాటి ఘటన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని గురించి చర్చించారు.
Advertisement
Advertisement