‘ఆప్’కు ఈసీ వార్నింగ్ ?
Published Sat, Mar 8 2014 10:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల నిరసన ప్రదర్శన హింసకు దారితీయడంపై ఆ పార్టీ ఇచ్చిన జవాబుతో ఢిల్లీ ఎన్నికల సంఘం సంతృప్తి పడలేదని తెలుస్తోంది. ప్రదర్శన నిర్వహించిన ఆప్ కార్యకర్తలు చట్టాన్ని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఎన్నికల కమిషన్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సమర్పించే నిజనిర్ధారణ నివేదిక ఆధారంగా ఆమ్ ఆద్మీ పార్టీని గట్టిగా మందలించాలని సంఘం యోచిస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్‌లో మళ్లీ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని, లేకుంటే పార్టీ గుర్తింపు రద్దుచేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీని హెచ్చరిస్తుందని అంటున్నారు.
అశోకారోడ్డులోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం జరిపిన నిరసన ప్రదర్శనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి శుక్రవారం సంజాయిషీ ఇచ్చింది. గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారన్న వార్త తెలిసి తమ కార్యకర్తలు వెంటనే ప్రతిస్పందించారని, ఇది పథకం ప్రకారం జరిపిన ప్రదర్శన కాదని వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఆప్ గౌరవిస్తుందని, దానిని అమలు చేయడంలో పూర్తిగా సహకరిస్తామని ఆప్ తెలిపింది. ఆప్ ప్రధాన కార్యదర్శి పంకజ్‌గుప్తా ఇచ్చిన ఒక పేజీ జవాబును పరిశీలిస్తున్నామని, సీసీటీవీల వీడియోలనూ చూశామని న్యూఢిల్లీ ఎన్నికల అధికారి అమేయ అభయంకర్ పేర్కొన్నారు. నిజనిర్ధారణ నివేదికను ఎన్నికల ప్రధాన అధికారికి పంపుతామన్నారు. ఆయన దానిని ఎన్నికల సంఘానికి సమర్పిస్తారని, దానిపై అది తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఇదిలా ఉంటే బుధవారం నాటి ప్రదర్శన సమయంలో ఆప్ కార్యకర్తలు అల్లర్లు, హింసకు పాల్పడుతూ తమ విధులకు ఆటంకం కలిగించారని నగర పోలీసులు ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. తాము ఎంత వారించినా వినకుండా ఆప్ సభ్యులు బీజేపీ కార్యాలయం వద్ద ఉన్న హోర్డింగులను చింపేశారని తెలిపారు. ఇక్కడ గుమిగూడడం నేరమని పోలీసులు మైకుల్లో ప్రకటించినా వినకుండా రాళ్లతో దాడి చేసి హింసకు దిగారని ఆరోపించారు. దీంతో వేరే మార్గం లేక వాటర్ కేనన్లు ప్రయోగించాల్సి వచ్చిందని, దీంతో రెచ్చిపోయిన ఆప్ నాయకులు పోలీసుల వాహనాలు, కేనన్లను ధ్వంసం చేశారని నివేదికలో తెలిపారు.
అంతటితో ఆగకుండా మళ్లీ బీజేపీ కార్యాలయ ప్రధానద్వారం ఎక్కి లోపల ఉన్న కార్యకర్తలపై కర్రలు, రాళ్లు విసిరారని విన్నవించారు. బయట ఉన్న కార్లను కూడా ధ్వంసం చేశారని పోలీసుల నివేదిక వివరించారు. ఈ ఘర్షణ సందర్భంగా నలుగురు పోలీసులు, 16 మంది ఆప్ కార్యకర్తలు, తొమ్మిది మంది బీజేపీ కార్యకర్తలు, ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. వీరని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో 14 మందిని అరెస్టు చేసి అల్లర్లకు దిగడం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, ఆస్తుల విధ్వసం తదితర నేరాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
Advertisement
Advertisement