ఢిల్లీ యువకులకు విజ్ఞప్తి చేసిన సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: నగరంలో మహిళలు స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తూ, భద్రతా నిలయంగా చేయాలని ఢిల్లీ యువకులకు ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హై బ్లడ్ షుగర్, దగ్గుతో బాధపడుతున్న కేజ్రీవాల్.. ప్రకృతి వైద్యం కోసం ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. అక్కడి నుంచే దాదాపు ఒక నిమిషం నిడివి గల ఆడియో సందేశాన్ని రేడియో ద్వారా శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ హోదాలో ఉండటానికి తన తల్లి, భార్య కారణమని ఆయన తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తనకు ఇంట్లో భార్య, తల్లి ఎంతో ప్రోత్సాహం అందించారన్నారు. మహిళల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు.
ఈ సందేశం నగరంలోని మగవాళ్లందరికీ వర్తిస్తుందన్నారు. ‘ప్రతి మహిళ తన బాధ్యతలను ఎంతో నిజాయితీగా, ఎలాంటి గొడవలు లేకండా నిర్వర్తిస్తోంది. ఇది చాలా అద్భుతమైన విషయం. తల్లిగా, కూతురుగా, భార్యగా, సోదరిగా ఇలా అన్ని హోదాల్లో తమ కుటుంబాలకు సేవలు అందిస్తున్నారు. వారి ఓర్పుకు నేను శాల్యూట్ చేస్తున్నా. మహిళ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అయితే కొందరు వారి దుస్తులపై కామెంట్లు చేస్తూ మహిళలను అవమానపరుస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. బయట మహిళలకు గౌరవం ఇవ్వని వారికి ఇంటిలో కూడా గౌరవం లభించదు’ అని చెప్పారు.
మహిళలకు భద్రతా నిలయంగా చేయండి
Published Sat, Mar 7 2015 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement